FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సీ న్యూ వరల్డ్ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడిగా హిస్టరీ

  • ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సీ న్యూ వరల్డ్ రికార్డు
  • 200వ అంతర్జాతీయ మ్యాచ్.. మరో మైలురాయి
  • దిగ్గజాలను అధిగమించిన మెస్సీ
Lionel Messi

Lionel Messi

ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఫిఫా ప్రపంచకప్ 2026లో అల్జీరియాతో జరిగిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన మెస్సీ, ప్రపంచకప్ చరిత్రలో ఎవరూ అందుకోలేని మైలురాయిని చేరుకున్నాడు. ఆరు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో ఆడిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

200వ అంతర్జాతీయ మ్యాచ్.. మరో మైలురాయి

కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ మెస్సీకి మరో ప్రత్యేకతను తీసుకొచ్చింది. అర్జెంటీనా తరఫున అతడు తన 200వ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడాడు. దీంతో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, కువైట్ దిగ్గజం బదర్ అల్-ముతావా తర్వాత 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు.

×
×
Ad

దిగ్గజాలను అధిగమించిన మెస్సీ

ఇప్పటి వరకు జర్మనీకి చెందిన లోథర్ మాత్తేయస్, మెక్సికో ఆటగాళ్లు ఆంటోనియో కార్బజాల్, రఫాయెల్ మార్క్వెజ్, ఆండ్రెస్ గార్డాడో, అలాగే జర్మనీ గోల్‌కీపర్ మాన్యుయెల్ నోయర్‌లు ఐదు ప్రపంచకప్‌లలో ఆడిన రికార్డును పంచుకున్నారు. ఇప్పుడు మెస్సీ వారందరినీ వెనక్కి నెట్టి, ఆరు ప్రపంచకప్‌లలో ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

2022లో అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన మెస్సీ

2022 ఖతార్ ప్రపంచకప్‌లో మెస్సీ అద్భుత ప్రదర్శనతో అర్జెంటీనాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ టోర్నీలో ఏడు గోల్స్ చేసిన అతడు, ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో రెండు గోల్స్ నమోదు చేసి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. పెనాల్టీ షూటౌట్‌లో కూడా తొలి విజయవంతమైన షాట్‌ను సాధించి అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.

మెస్సీ గణాంకాలు అదిరిపోయేలా…

అర్జెంటీనా జెర్సీలో మెస్సీ ప్రస్థానం అసాధారణమనే చెప్పాలి.

200 అంతర్జాతీయ మ్యాచ్‌లు
118 గోల్స్
64 అసిస్టులు
ప్రపంచకప్‌లలో 27 మ్యాచ్‌లు
14 ప్రపంచకప్ గోల్స్
8 అసిస్టులు

ఈ గణాంకాలు మెస్సీ ఎంత గొప్ప ఆటగాడో మరోసారి నిరూపిస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది బాలన్ డి’ఓర్ అవార్డులు, కోపా అమెరికా టైటిళ్లు, ప్రపంచకప్ ట్రోఫీని గెలిచిన మెస్సీ, ఇప్పుడు ఆరు ప్రపంచకప్‌లలో ఆడిన తొలి ఆటగాడిగా మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలో అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.