Site icon NTV Telugu

IPL 2022: మైదానంలో కృనాల్ పాండ్యా ఓవరాక్షన్.. మాజీల మండిపాటు

Krunal Pandya

Krunal Pandya

ఆదివారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ వేగంగా ఆడలేకపోయాడు. 20 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. చివరి ఓవర్‌లో ముంబై గెలవాలంటే 38 పరుగులు చేయాలి. ఈ దశలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి ఓవర్‌లో బంతిని కృనాల్ పాండ్యాకు అందించాడు. దీంతో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో పొలార్డ్ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.

ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్‌ భుజం ఎక్కి కృనాల్‌ పాండ్యా అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. కానీ పొలార్డ్‌ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్‌ చేరాడు. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు పొలార్డ్, కృనాల్ పాండ్యా మంచి స్నేహితులు. కానీ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థుల్లా తలపడ్డారు. తొలుత లక్నో బ్యాటింగ్ సమయంలో కృనాల్ వికెట్‌ను పొలార్డ్ తీశాడు. అనంతరం అతడి వికెట్ కృనాల్ తీయడంతో ఆనందానికి హద్దు లేకపోవచ్చు. కానీ పొలార్డ్‌ను ముద్దు పెట్టుకుని అతడిని కవ్వించేలా చేయడాన్నే అందరూ తప్పుపడుతున్నారు.

అవుటైన పొలార్డ్ మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా కృనాల్ పాండ్యా వ్యవహరించిన తీరుపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్ ఘాటుగా స్పందించాడు. ‘కృనాల్‌, పొలార్డ్‌ మంచి స్నేహితులు. కానీ ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. పొలార్డ్‌ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్‌ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్‌ నాకైతే మరీ ఓవర్‌గా అనిపిస్తోంది’ అంటూ కృనాల్ తీరును తప్పుబట్టాడు.

మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ కూడా ఈ అంశంపై మాట్లాడాడు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిదని.. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేమని.. ఒకవేళ పొలార్డ్‌ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేది అంటూ కృనాల్‌ను ప్రశ్నించాడు. తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్‌ ఇలా చేయడం నిజంగా టూ మచ్‌ అని ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు.

https://www.youtube.com/watch?v=QcwN-dIyNXo

IPL 2022: ఓ ఇంటి వాడైన చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు

Exit mobile version