NTV Telugu Site icon

IPL 2022: బుమ్రా పాంచ్ పటాకా వృథా.. ముంబైకి 9వ ఓటమి

Kolkatta Knight Riders Min

Kolkatta Knight Riders Min

ఐపీఎల్‌లో సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓ దశలో 200 స్కోరు చేసేలా కనిపించిన కోల్‌కతా తక్కువ పరుగులు చేసిందంటే దానికి కారణం బుమ్రా. అతడు 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఓ మెయిడిన్ సహా 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా ఐదు వికెట్లు పడగొట్టడంతో కోల్‌కతా మిడిలార్డర్, లోయరార్డర్ రాణించలేకపోయింది. వెంకటేష్ అయ్యర్ (43), నితీష్ రాణా (43) హాఫ్ సెంచరీలు చేయలేకపోయారు.

అనంతరం 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని సైతం ఛేదించలేక 113 పరుగులకే ముంబై ఇండియన్స్ కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (2) మరోసారి విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ (51) రాణించినా అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. ఇషాన్ కిషన్ తర్వాత జట్టులో అత్యధిక స్కోరు పొలార్డ్ (15)దే అంటే ముంబై బ్యాటింగ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా ఆండీ రసెల్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల టేబుల్‌లో 5 విజయాలు, 7 పరాజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతమే జరగాలి. అటు టోర్నీలో ముంబై ఇండియన్స్‌కు ఇది 9వ ఓటమి. ఆ జట్టు పాయింట్ల టేబుల్‌లో కేవలం 4 పాయింట్లతో అట్టడుగున ఉంది.

Virat Kohli: కోచ్ అంటే ఇలా ఉండాలి.. నెట్టింట్లో వీడియో వైరల్

Show comments