ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర పరాజయం పాలైంది. పూణె వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా టీమ్ 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంద్రజిత్(0), ఫించ్(14), శ్రేయస్ అయ్యర్(6), నితీష్ రాణా(2), రింకూ సింగ్(6) విఫలమయ్యారు. ఆండ్రూ రస్సెల్ 19 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో 45 పరుగులు చేసి అవుటయ్యాడు. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ 3 వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్ 3, మోసిన్‌ఖాన్, చమీరా, రవి బిష్ణోయ్ తలో వికెట్ సాధించారు.
నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో రాణించాడు. డికాక్ 36 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 50 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. గుజరాత్ టైటాన్స్‌తో పాటు లక్నో టీమ్ ఖాతాలో కూడా 16 పాయింట్లు ఉండగా.. రన్‌రేట్ తేడాతో లక్నో ముందంజలో నిలిచింది.
