KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!

Kl Rahul Gift

Kl Rahul Gift

KL Rahul Smartphone Gift: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన మంచి మనసును చాటుకున్నాడు. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుగా అందుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ఓ మహిళా అధికారికి బహుమతిగా ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. రాహుల్ చేసిన ఈ అనూహ్యమైన పనికి సదరు అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోషల్ మీడియాలో పంచుకుంది.

‘కేఎల్ రాహుల్ అవార్డుగా అందుకున్న ఫోన్‌ను నాకు ఇచ్చేశారు. నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. రాహల్ ది గొప్ప మనసు. నిజంగా ఆయన నుంచి ఇలాంటి బహుమతిని ఊహించలేదు’ అని సదరు మహిళా అధికారి వీడియోలో పేర్కొంది. రాహుల్ మంచి మనసును బీసీసీఐ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. ‘పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు. ఇది నిజమైన కేఎల్ క్లాస్’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇక వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఫలితాన్ని నిర్ణయించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేస్తూ 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. డారిల్ మిచెల్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఔకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్ చెరో రెండు వికెట్లు తీశారు. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో భారత్ విజయానికి చేరువైంది. అయితే చివర్లో న్యూజిలాండ్ బౌలర్లు మళ్లీ పుంజుకుని భారత జట్టును 113/7కు పరిమితం చేశారు. అదే సమయంలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. అప్పటికి డీఎల్ఎస్ పార్ స్కోరుకంటే భారత్ నాలుగు పరుగుల ఆధిక్యంలో ఉండటంతో విజయం టీమిండియాను వరించింది.