NTV Telugu Site icon

Team India: శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్ అనుమానం

Kl Rahul

Kl Rahul

Team India: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను నెగ్గడానికి టీమిండియా తల ప్రాణం తోకకు వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా రెండో టెస్టులో ఓటమి దిశగా సాగి భారత ఆటగాళ్లు కలవరపెట్టారు. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ అశ్విన్ భారత్ పరువు కాపాడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే తదుపరి సిరీస్‌పై అందరి కన్ను పడింది. స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఆడాల్సి ఉంది. ఈ మేరకు స్వదేశంలో తలపడే జట్టు ఎంపిక బాధ్యత చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముందు ఇప్పుడు ఉంది. ఈ సెలక్షన్ కమిటీకి ఇదే చివరి ఎంపిక కానుంది.

ప్రస్తుత సెలక్షన్ కమిటీ పనితీరు ఆశించిన విధంగా లేకపోవడం, జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో కొత్త సెలక్షన్ కమిటీని బీసీసీఐ నియమించే పనిలో ఉంది. ఈ లోపే జనవరి 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో భారత్ తలపడనుంది. శ్రీలంకతో సిరీస్‌కు టీ20, వన్డేలకు విడిగా జట్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలక్షన్ కమిటీపై ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం ఆధారంగా కేఎల్ రాహుల్‌కు టీ20 సిరీస్‌లో అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. పైగా ఆసియా కప్ తర్వాత టీ20ల్లో రాహుల్ పనితీరు ఆశించిన విధంగా లేదు. 16 ఇన్నింగ్స్‌లలో అతడు కేవలం ఆరు అర్ధ సెంచరీలు చేశాడు. మిగిలిన 10 ఇన్నింగ్స్‌లలో అతడు ఒక అంకె స్కోరుకే వెనుదిరిగాడు.

Read Also: Fight for 4 hundred Rupees: 400 వందల కోసం గొడవ.. లారీ కిందతోసి హత్య

మరోవైపు వేలి గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్ శర్మ సైతం అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాల ఆధారంగా తెలుస్తోంది. దీంతో హార్ధిక్ పాండ్యా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కేఎల్ రాహుల్‌కు విరామం ఇస్తే, సెలక్టర్లు శుభమన్ గిల్‌కు అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. విరాట్ కోహ్లీకి సైతం శ్రీలంకతో సిరీస్‌కు అవకాశం లభించకపోవచ్చని తెలుస్తోంది. జనవరి 3 నుంచి మూడు టీ20లు, జనవరి 10 నుంచి మూడు వన్డే మ్యాచ్‌లలో శ్రీలంక-భారత్ పోటీ పడనున్నాయి.

Show comments