KL Rahul Tests Positive For Covid 19: భారత టాపార్డర్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అదృష్టం ఇతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే.. దరిద్రం ముద్దాడేసుకుంటోంది. ఇటీవల జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న ఈ ఆటగాడు.. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్, ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు. సర్జరీ అనంతరం భారత్‌కి తిరిగొచ్చిన అతడు.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలోనే సెలెక్షన్ కమిటీ అతడ్ని వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్‌కు విశ్రాంతినిచ్చి, టీ20 సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో.. ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకొని, వెస్టిండీస్ గడ్డకు పయనమవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. ఇంతలోనే కేఎల్ రాహుల్‌కి ఊహించని షాక్ తగిలింది. చికిత్స తర్వాత కోలుకున్నాడని ఆనందించేలోపు ఇతడు కరోనా బారినపడ్డాడు. తద్వారా.. వచ్చే వారం విండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు రాహుల్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేఎల్ రాహుల్‌తో సన్నిహితంగా మెలిగిన వారిని సైతం పరీక్షిస్తున్నారు.
కాగా.. శుక్రవారం నుంచి వెస్టిండీస్, భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టుకి శిఖర్ ధావన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంతకుముందు ధవన్ శ్రీలంక పర్యటనలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కి విశ్రాంతి ఇవ్వడంతో.. సెలెక్షన్ కమిటీ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వన్డే సిరీస్ తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
