KKR Retention and Released List 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. గత రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కేకేఆర్.. వచ్చే సీజన్ కోసం తమ ఆటగాళ్ల జాబితాను పునఃసమీక్షించనుంది. ముఖ్యంగా భారీ ధరకు కొనుగోలు చేసిన విదేశీ ఆటగాళ్లతో పాటు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కొందరిపై వేటు పడే అవకాశాలు లేకపోలేదు. 2027 సీజన్‌కు సంబంధించి కేకేఆర్ అధికారిక రిటెన్షన్, రిలీజ్ జాబితాను ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ ప్లేయర్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి.
రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ (అంచనా):
కేకేఆర్ తమ భారత ఆటగాళ్ల ప్రధాన బృందాన్ని కొనసాగించే అవకాశం ఉంది. రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా జట్టుకు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరితో పాటు రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, అంగ్క్రిష్ రఘువంశీ కూడా జట్టులో కొనసాగే అవకాశముంది. సీనియర్ ప్లేయర్ సునీల్ నరైన్‌ను కూడా కేకేఆర్ కొనసాగించవచ్చు. మనీష్ పాండే, అనుకూల్ రాయ్ వంటి భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లలో రోవ్‌మన్ పావెల్, కామెరూన్ గ్రీన్, మతీషా పతిరణ, ఫిన్ అలెన్ పేర్లు రిటెన్షన్ జాబితాలో ఉన్నాయని సమాచారం. రాహుల్ త్రిపాఠి, ఆకాష్ దీప్, తేజస్వి దహియా, కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజరబానీ కూడా కొనసాగవచ్చు.
రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ (అంచనా):
మరోవైపు కొందరు ఆటగాళ్లను వదులుకోవాలని కేకేఆర్ యాజమాన్యం చూస్తోందట. న్యూజిలాండ్ ఆటగాళ్లు టిమ్ సీఫర్ట్, రచిన్ రవీంద్ర జట్టును వీడే అవకాశాలు ఉన్నాయి. ముస్తాఫిజుర్ రహ్మాన్‌తో పాటు దేశవాళీ ఆటగాళ్లు దక్ష్ కమ్రా, సార్థక్ రంజన్, ప్రశాంత్ సోలంకీలను కూడా విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు.
కేకేఆర్ మార్పులకు కారణం ఇదేనా?:
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓటములు ఎదుర్కొన్న ఆ జట్టు.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆరు మ్యాచ్‌ల తర్వాత కూడా విజయం సాధించలేకపోయింది. అయితే ఆ తర్వాతి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ ఇతర జట్ల ఫలితాలు అనుకూలించకపోవడంతో కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ముఖ్యంగా 2026 వేలంలో కామెరూన్ గ్రీన్ కోసం రూ.25.20 కోట్లు, మతీషా పతిరణ కోసం రూ.18 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఇద్దరి కోసం వెచ్చించిన మొత్తం రూ.43.20 కోట్లు. ఇంత భారీ పెట్టుబడికి తగిన ఫలితం లభించిందా?, వచ్చే సీజన్లోనూ వీరిని కొనసాగించాలా? అనే అంశాలపై జట్టు మేనేజ్మెంట్ సమీక్షించే అవకాశం ఉంది.

