Zaheer Khan CSK Head Coach: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. సోమవారం (సెప్టెంబర్ 21) సాయంత్రం జహీర్ నియామకాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్లుగా జట్టుతో కొనసాగిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానాన్ని జహీర్ భర్తీ చేశాడు. అయితే జహీర్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేయడం వెనుక మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించినట్లు సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. జహీర్ పేరును ధోనీనే సూచించినట్లు తెలిపారు. ధోనీ ప్రతిపాదనకు సీఎస్‌కే యాజమాన్యం, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అంగీకరించడంతో జహీర్‌ను సంప్రదించినట్లు విశ్వనాథన్ చెప్పారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన కాశీ విశ్వనాథన్.. ‘హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ పేరును సూచించింది ఎంఎస్ ధోనీయే. క్రికెట్ మేనేజ్‌మెంట్ టీమ్‌లో ఉన్న రూపా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా జహీర్ ఈ బాధ్యతకు సరిపోతాడని అంగీకరించారు. జహీర్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేయడం వెనుక ధోనీదే కీలక పాత్ర. జహీర్‌కు ఇప్పటికే ఐపీఎల్‌లో కోచింగ్, మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అనుభవం ఉండటం కూడా అతడి ఎంపికకు ప్రధాన కారణం. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో కలిసి పనిచేసిన అనుభవం జహీర్‌కు ఉంది. అందుకే అతడే సరైన వ్యక్తి అని భావించాం’ అని కాశీ విశ్వనాథన్ చెప్పారు.
జహీర్ ఖాన్‌ను సీఎస్‌కే హెడ్ కోచ్ పదవికి ఒప్పించడం అంత సులభంగా జరగలేదని కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అతడితో చర్చలు జరిపి, కొంత సమయం తీసుకున్న తర్వాతే జహీర్ ఈ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. జహీర్ ఖాన్‌కు ఆటగాడిగా మాత్రమే కాకుండా ఐపీఎల్ జట్ల మేనేజ్‌మెంట్‌లోనూ మంచి అనుభవం ఉంది. ముంబై ఇండియన్స్‌తో కలిసి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా పనిచేశాడు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్, బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఇక ధోనీ, జహీర్ భారత జట్టు తరఫున కలిసి ఆడారు. దీంతో ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి అవగాహన ఉంది. ఈ అనుభవం కూడా సీఎస్‌కేలో జహీర్ నియామకానికి ఉపయోగపడినట్లు తెలుస్తోంది.
జహీర్ ఖాన్ నియామకంతో సీఎస్‌కే కోచింగ్ సెటప్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై చర్చ మొదలైంది. కొత్త హెడ్ కోచ్‌కు తనకు నచ్చిన సహాయక కోచింగ్ సిబ్బందిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను సీఎస్‌కే ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఐపీఎల్ 2027కు ముందు సీఎస్‌కే కోచింగ్ వ్యవస్థలో పలు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కే తమ ఆటగాళ్ల బృందంలో పలు మార్పులు చేసింది. ఇప్పుడు హెడ్ కోచ్‌గా జహీర్ రాకతో కోచింగ్ విభాగంలోనూ కొత్త మార్పులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

