దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై క్రీడాభిమానుల నుంచి ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైందో అందరికీ తెలిసిందే! కొందరు మాజీలు సైతం అతడ్ని సెలక్ట్ చేయనందుకు పెదవి విరిచారు. అతడో గొప్ప ఆటగాడని, అవకాశాలు ఇస్తేనే సత్తా చాటుకోవడానికి వీలుంటుందని, కానీ ఎందుకు అతడ్ని జట్టులో తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటు, క్రీడాభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్‌లో అంతగా సత్తా చాటని వారికి ఛాన్సిచ్చి, సంజూని ఎందుకు పక్కన పెట్టారంటూ ప్రశ్నలు కురిపించారు.
ఈ నేపథ్యంలోనే సంజూ శాంసన్ ఆటతీరుపై తాజాగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘సంజూలో చాలా ప్రతిభ ఉంది. అయితే, అతడు ఒకట్రెండు మ్యాచెస్‌లో బాగా ఆడితే, ఇతర మ్యాచెస్‌లో మాత్రం డీలా పడిపోతున్నాడు. స్థిరత్వాన్ని కొనసాగించడంలో విఫలమవుతున్నాడు. అతనిలో అదే మైనస్ పాయింట్’’ అని కపిల్ దేవ్ చెప్పారు. ఒకవేళ అతడు నిలకడగా రాణిస్తే, కచ్ఛితంగా ఒక గొప్ప ఆటగాడిగా అవతరిస్తాడని పేర్కొ్న్నారు. ఇప్పుడు నిలకడగా రాణిస్తోన్న వికెట్ కీపర్లలో దినేశ్ కార్తీక్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడని అభిప్రాయపడ్డారు. ఇషాన్ కిషన్ మాత్రం ఒత్తిడికి లోనవుతున్నాడని, బహుశా టీ20 వేలంలో అతను భారీ ధర పలకడమే అందుకు కారణమై ఉండొచ్చని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.
కాగా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో సంజూ శాంసన్ మరీ అదిరిపోయే లెవెల్‌లో ప్రదర్శన కనబర్చలేదు కానీ, పర్వాలేదనిపించాడు. మొత్తం 17 మ్యాచెస్ ఆడిన ఇతగాడు.. 28.63 సగటున 146.79 స్ట్రైక్ రేట్‌తో 458 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థసెంచరీలు మాత్రమే ఉండగా, అత్యధిక స్కోరు 55. నిలకడ ఫామ్ కనిర్చలేదు. అందుకే, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు ఎంపిక అవ్వలేదని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.