Site icon NTV Telugu

Rohini Kalam: విషాదం.. జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య

Rohini Kalam1

Rohini Kalam1

క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం (35) ఆత్మహత్య చేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో భారతదేశానికి రోహిణి కలాం ప్రాతినిధ్యం వహించింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. రోహిణి కలాం గదిలో వేలాడుతూ కనిపించడంతో సోదరి ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒత్తిడి కారణంగా రోహిణి కలాం ఆత్మహత్య చేసుకున్నట్లుగా సోదరి ఆరోపించింది.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. రాధాగంజ్‌లోని అర్జున్ నగర్‌లోని ఇంట్లో రోహిణి కలాం వేలాడుతూ కనిపించడంతో చెల్లెలు రోష్ని కలాం అందరినీ అప్రమత్తం చేసిందని చెప్పారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించారని.. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ప్రకటించినట్లు వెల్లడించారు. రోహిణి కలాం ఆత్మహత్య సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరని చెప్పారు.

ఇక పోలీసులకు రోహిణి సోదరి రోష్ని కీలక విషయాలు వెల్లడించింది. అష్టాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పనిచేస్తున్నట్లుగా తెలిపింది. శనివారం దేవాస్‌లోని ఇంటికి తిరిగి వచ్చిందని.. ఉద్యోగ సంబంధిత ఒత్తిడిలో ఉన్నట్లుగా రోహిణి కలాం కనిపించిందని చెప్పుకొచ్చింది. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకుని ఫోన్ మాట్లాడుతూ తన గదిలోకి వెళ్లిపోయిందని వివరించింది. పాఠశాలలో అధ్యాపకులు చాలా ఇబ్బంది పెడుతున్నారని.. ప్రిన్సిపాల్ సైతం ఇబ్బంది పెడుతుందని చెప్పింది. ఫోన్‌లో మాట్లాడుతున్న సంభాషణను బట్టి గ్రహించినట్లుగా పేర్కొంది. రోహిణి కలాంకు వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించినా అందుకు ఆమె నిరాకరించినట్లు రోష్ని తెలిపింది.

ఇదిలా ఉంటే ఐదు నెలల క్రితం రోహిణి కలాంకు శాస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంతోనే బాధపడుతుందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీనికి తోడు పాఠశాలలో పని ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంటుందని కుటుంబ సభ్యులు వాపోయారు.

కెరీర్ ఇలా..
2007లో రోహిణి తన క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రొఫెషనల్ జియు-జిట్సు కెరీర్ 2015లో ప్రారంభమైంది. హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. బర్మింగ్‌హామ్‌లో జరిగే ప్రపంచ క్రీడలకు ఎంపికైన ఏకైక భారతీయ అథ్లెట్‌గా అరుదైన ఘనతను సాధించింది. థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో 48 కిలోల విభాగంలో కాంస్యం, అబుదాబిలో జరిగిన 8వ ఆసియా జియు-జిట్సు ఛాంపియన్‌షిప్ 2024 డ్యూయో క్లాసిక్ ఈవెంట్‌లో మరో కాంస్యం సాధించింది.

రోహిణి కలాం మృతి పట్ల భారతీయ క్రీడా సమాజం విచారం వ్యక్తం చేసింది. ప్రతిభావంతురాలైన అథ్లెట్‌ను కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Exit mobile version