ఈమధ్య ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ మీద ప్రతి మ్యాచ్‌కి ముందు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్ & మాజీలు. ముఖ్యంగా.. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కోహ్లీ కచ్ఛితంగా దుమ్ములేపుతాడని, తిరిగి ఫామ్‌లోకి వస్తాడని చాలా ఆశించారు. కానీ, కోహ్లీ ఆ ఆశలపై నీళ్లూ చల్లుతూ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 25 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. మూడు ఫోర్ల సహాయంతో 16 పరుగులే చేశాడు. విల్లే బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లీ ఆటతీరుపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే అతనికి మద్దతుగా ఆటగాళ్లు దిగొస్తున్నారు. ఆల్రెడీ పాకిస్తాన్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజం.. కోహ్లీ ఔటైన కొన్ని క్షణాల తర్వాత ‘‘ఆ గడ్డు పరిస్థితి కూడా గడిచిపోతుంది, నువ్వు స్ట్రాంగ్‌గా ఉండు’’ అని అతనికి మద్దతుగా ట్వీట్ చేశాడు. ఇప్పుడు తాజాగా జోస్ బట్లర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘కోహ్లి కూడా మనిషే. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో అతడు తక్కువ స్కోర్లే చేసి ఉండొచ్చు. అయితే, ఒక్కటి మాత్రం నిజం. అతను అత్యుత్తమ బ్యాట్స్మన్లలో ఒకడు. ఇంకా చెప్పాలంటే.. వన్డే క్రికెట్‌లో వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాట్స్మన్. ఏ ఆటగాడైనా ఒక్కోసారి ఫామ్‌లేమితో సతమతమవ్వడం సహజం. మెరుగైన ప్రదర్శన చేయలేకపోతారు’’ అని కోహ్లికి అండగా చెప్పుకొచ్చాడు.
అంతేకాదు.. కోహ్లీ లాంటి క్లాస్ ప్లేయర్ తమతో మ్యాచ్‌లో రాణించకూడదనే తాము కోరుకుంటామని, కచ్ఛితంగా అతని మీదే ఎక్కువ దృష్టి సారిస్తామని బట్లర్ చెప్పాడు. కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అతని రికార్డులే చెప్తాయని, టీమిండియాను ఎన్నోసార్లు ఒంటిచేత్తో గెలిపించాడని పేర్కొన్నాడు. అలాంటి కోహ్లీ నైపుణ్యాలపై సందేహాలు వ్యక్తం చేయడం, అతడి ఆట తీరును ప్రశ్నించడం ఏమాత్రం సబబు కాదని బట్లర్ వ్యాఖ్యానించాడు.
