టెస్టుల్లో ఇటీవల కాలంలో ఇంగ్లండ్ దారుణ పరాజయాలను చవిచూస్తోంది. యాషెస్ సిరీస్ నుంచి ఆ జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. చివరి 17 టెస్టుల్లో ఇంగ్లండ్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. దీంతో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ నైతిక బాధ్యత వహిస్తూ తన కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఇది తనకు ఎంతో కఠిన నిర్ణయం అయినా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు రూట్ వివరించాడు. అంతేకాకుండా తన దేశాన్ని నడిపించినందుకు సంతోషంగా ఉందన్నాడు. గడిచిన ఐదేళ్లు తనకెంతో గర్వకారణమని.. కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు రూట్ పేర్కొన్నాడు.
ఇటీవల వెస్టిండీస్ గడ్డపైనా ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో విమర్శలు వచ్చాయి. రూట్ నాయకత్వంలో ఇంగ్లండ్ 64 టెస్టులు ఆడగా అందులో 27 విజయాలను నమోదు చేయగా 26 ఓటములను చవిచూసింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కెప్టెన్సీ తన ఆటతీరును ప్రభావితం చేస్తోందని రూట్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడడాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. ఇంగ్లండ్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎవరు నియమితులైనా తన సంపూర్ణ సహకారం అందిస్తానని, జట్టు సహచరులు, కోచ్‌లకు తన నుంచి మద్దతు ఉంటుందని రూట్ స్పష్టం చేశాడు.
