Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!

Jasprit Bumrah Test Record

Jasprit Bumrah Test Record

Most wickets for India in Tests: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పదో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు మూడు వికెట్స్ పడగొట్టడంతో ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్‌ను అధిగమించాడు. శ్రీనాథ్ తన టెస్టు కెరీర్‌లో 236 వికెట్లు తీయగా.. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 237 వికెట్లు ఉన్నాయి.

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా తొలి సెషన్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో సెషన్‌లో మరో వికెట్ తీసి తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. దీంతో జవగళ్ శ్రీనాథ్ రికార్డును అధిగమించాడు. భారత టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో (132 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 106 మ్యాచ్‌లలో 537 వికెట్లతో రెండో స్థానంలో, కపిల్ దేవ్ 131 మ్యాచ్‌లలో 434 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఈ జాబితాలో హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హర్భజన్ 103 మ్యాచ్‌లలో 417 వికెట్స్ తీయగా.. జడేజా 91 మ్యాచ్‌లలో 356 వికెట్స్ పడగొట్టాడు. ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ చెరో 311 వికెట్లతో 6,7 స్థానాల్లో ఉన్నారు. బిషన్ సింగ్ బేడీ 67 మ్యాచ్‌లలో 266 వికెట్స్ తీయగా.. బీఎస్ చంద్రశేఖర్ 58 మ్యాచ్‌లలో 242 పడగొట్టాడు. పదవ స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. 53 మ్యాచ్‌లలోనే 237 వికెట్లు తీశాడు. బుమ్రా ఫామ్ చూస్తే.. త్వరలోనే చంద్రశేఖర్, బేడీ, ఇషాంత్, జహీర్ రికార్డులను అధిగమించనున్నాడు.

అత్యధిక టెస్ట్ వికెట్ల లిస్ట్ (భారత్):
అనిల్ కుంబ్లే 619
రవిచంద్రన్ అశ్విన్ 537
కపిల్ దేవ్ 434
హర్భజన్ సింగ్ 417
రవీంద్ర జడేజా 356
ఇషాంత్ శర్మ 311
జహీర్ ఖాన్ 311
బిషన్ సింగ్ బేడీ 266
బీఎస్ చంద్రశేఖర్ 242
జస్ప్రీత్ బుమ్రా 237