Jacob Duffy on Virat Kohli Batting: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్‌లో 186 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు కొంత ఇబ్బంది పడినా.. కింగ్ మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. కేవలం 51 బంతుల్లోనే 74 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ పేసర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సహచరుడు జాకబ్ డఫీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నెట్స్‌లో కోహ్లీకి చాలాసార్లు బౌలింగ్ చేశానని, కానీ మ్యాచ్‌లో అతడికి బౌలింగ్ చేయడం కొంత విసుగు తెప్పించిందని చెప్పాడు.
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన డఫీని.. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి బౌలింగ్ చేయడం ఎలా అనిపించిందని విలేకరులు ప్రశ్నించారు. దీనికి అతడు స్పందిస్తూ.. ‘కొంచెం విసుగు తెప్పించింది. లక్ష్యం చిన్నదిగా ఉన్నప్పుడు కోహ్లీ లాంటి ఆటగాడు దూకుడుగా వచ్చి పరుగులు చేయడం ప్రారంభిస్తే ఛేదన చాలా సులభమవుతుంది. ఛేదనలో సులువుగా రన్స్ చేయడంలో కోహ్లీకి చాలా నైపుణ్యం ఉంది. బౌన్స్‌కు ఏమాత్రం ఇబ్బంది పడలేదు. హుక్, పుల్ షాట్లతో పాటు బంతిని నేరుగా బౌండరీకి తరలించాడు. అతడు గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బెంగళూరులోని నెట్స్‌లోనూ నన్ను చాలాసార్లు ఇలాగే ఉతికారేశాడు’ అని డఫీ పేర్కొన్నాడు.
ఒకవేళ భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే లేదా లక్ష్యం భారీగా ఉండి ఉంటే విరాట్ కోహ్లీ ఆటతీరు మరోలా ఉండేదేమోనని డఫీ అన్నాడు. ‘లక్ష్యం పెద్దదిగా ఉన్నప్పుడు కోహ్లీ ఇదే తరహాలో ఆడేవాడా లేదా అనేది ఆసక్తికరంగా ఉండేది. బెంగళూరులో నెట్స్‌లో అతడి ఆటను దగ్గరగా గమనించే అవకాశం నాకు వచ్చింది. అయినప్పటికీ అతడి ఆటలో పెద్దగా లోపాలు కనిపించలేదు. ఈడెన్ పార్క్ వంటి చిన్న మైదానాల్లో బౌలర్లు వేసే వేగాన్ని కింగ్ చక్కగా ఉపయోగించుకుంటాడు. అవసరమైతే బంతిని తల మీదుగా కూడా బలంగా బాదగలడు. విరాట్ ఆటలో లోపాలు వెతకడం చాలా కష్టం’ అని చెప్పాడు.
విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి కూడా డఫీ మాట్లాడాడు. విమానాశ్రయాల్లో, విమానాల్లో కోహ్లీతో కలిసి ప్రయాణించినప్పుడు అతడికి అభిమానుల నుంచి లభించే ఆదరణను దగ్గరగా చూశానని తెలిపాడు. ‘కోహ్లీ జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. అతడిని అభిమానులు ఎప్పుడూ చుట్టుముడుతుంటారు. ఇంతటి అభిమానాన్ని ఎలా ఎదుర్కొంటాడో ఆశ్చర్యంగా ఉంటుంది. భారత ఆటగాళ్లు, ముఖ్యంగా కోహ్లీ అభిమానుల పట్ల ఎంతో ఓపికగా ఉంటారు. వారిచ్చే ప్రేమను గౌరవిస్తారు. విదేశీ ఆటగాళ్లుగా కొన్నిసార్లు ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టంగా అనిపిస్తుంది. కానీ కోహ్లీ మాత్రం అభిమానుల పట్ల ఎంతో ఓపికగా ఉంటాడు. ఆ విషయంలో అతడిని చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. అతడి జీవనశైలి మాత్రం చాలా ప్రత్యేకం. అంతటి అభిమానుల మధ్య ఉండటం నా వల్ల కాకపోవచ్చు. కోహ్లీ వ్యవరించే తీరు అద్భుతం’ అని డఫీ ప్రశంసించాడు.

