Suryakumar Yadav ODI Career: భారత టీ20 క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ‘మిస్టర్ 360’, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2021 నుంచి 2023 మధ్య భారత జట్టు తరఫున 37 వన్డేలు ఆడిన సూర్య 773 పరుగులు చేశాడు. సూరీడు బ్యాటింగ్ సగటు 25.76గా ఉంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచ్ అతడికి చివరి వన్డేగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో సూర్య 28 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత సూర్యకు వన్డే జట్టులో చోటు దక్కలేదు.
తాజాగా మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన సంభాషణలో సూర్యకుమార్ యాదవ్ తన వన్డే కెరీర్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. టీ20ల్లో సాధించిన విజయాన్ని వన్డేల్లో పునరావృతం చేయలేకపోవడంపై తీవ్ర నిరాశగా ఉందని చెప్పాడు. తన వైఫల్యానికి ఇతరులను నిందించకుండా.. 50 ఓవర్ల క్రికెట్‌కు అవసరమైన కష్టాన్ని తాను పడలేదని అంగీకరించాడు. టెస్టు క్రికెట్‌లో పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పిన సూరీడు.. వన్డేల్లో మాత్రం తన వైఫల్యానికి తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
‘వన్డేల్లో టీ20 మాదిరిగానే వైట్‌బాల్ క్రికెట్ ఉన్నప్పటికీ.. ఆ ఫార్మాట్‌కు అవసరమైన స్థాయిలో నేను కష్టపడలేకపోయా. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి ఉంటే టెస్టులు, వన్డేల్లో మరింత బాగా రాణించేవాడినేమో అని ఊహించుకోవచ్చు కానీ.. వాస్తవ పరిస్థితులను చూస్తే నా వన్డే కెరీర్‌పై మాత్రం పూర్తిగా నిరాశ ఉంది. వన్డే క్రికెట్ బ్యాటర్లకు అత్యంత కఠినమైన ఫార్మాట్. ఎందుకంటే ఒకే ఇన్నింగ్స్‌లో పలుమార్లు ఆటతీరును మార్చాల్సి ఉంటుంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు 0/2 వంటి స్కోరుతో క్రీజులోకి రావచ్చు. ఆరో స్థానంలో వచ్చే బ్యాటర్ 24/4 పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాల్సి రావచ్చు. అలాంటి సమయంలో ప్రారంభంలో టెస్టు మ్యాచ్ తరహాలో బౌలర్లను గౌరవిస్తూ ఆడాలి. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నిర్మిస్తూ స్ట్రైక్‌రేట్‌ను 50 నుంచి 75 వరకు తీసుకెళ్లాలి. అనంతరం వేగాన్ని పెంచుతూ 100కు, చివర్లో టీ20 తరహాలో 130-140 స్ట్రైక్‌రేట్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది’ అని సూర్య వివరించాడు.
‘వన్డేల్లో సమస్య ప్రధానంగా నా ప్రిపరేషన్‌లోనే ఉంది. ఐదో లేదా ఆరో స్థానంలో నేను బ్యాటింగ్ చేయగలనన్న విషయం నాకు తెలుసు. అయినప్పటికీ వన్డే ఫార్మాట్‌ను పూర్తిగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా సిద్ధం కాలేకపోయా. ఈ విషయంపై ఇంట్లో నా భార్యతో కూడా మాట్లాడా. వన్డేల్లో నువ్ ఇంకా ఎక్కువగా ఆడాల్సి ఉండేది? అని చెప్పింది. నేను మరింత కష్టపడి ఉంటే వన్డే కెరీర్‌ను మెరుగ్గా మలుచుకునే అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు. టీ20 క్రికెట్ విషయంలో నేను నా సాధారణ పరిమితులను దాటి కష్టపడుతున్నా. ఒక ఆటగాడు మైదానంలో ఫలితాలు సాదిస్తున్నాడంటే.. దాని కంటే ముందే చేసిన కష్టమే అందుకు కారణం’ అని సూర్య చెప్పుకొచ్చాడు.
తనను తాను ప్రతిరోజూ నిజాయితీగా ప్రశ్నించుకుంటానని సూరీడు తెలిపాడు. తప్పులు జరిగినప్పుడు వాటికి కారణాలు వెతకడం కంటే.. వాటిని అంగీకరించి సరిదిద్దుకోవాలని సూచించాడు. ఒక ఆటగాడి ఎదుగుదలకు ఆత్మపరిశీలన ఎంతో అవసరమని చెప్పాడు. టీ20 క్రికెట్‌లో ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగిన సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అయితే తన తప్పులను స్వయంగా అంగీకరించడం ద్వారా మరోసారి అతడి నిజాయితీ బయటపడింది. భవిష్యత్తులో వన్డే జట్టులో తిరిగి అవకాశం వస్తే.. తన గత అనుభవాల నుంచి నేర్చుకుని మెరుగ్గా రాణించాలనే పట్టుదలతో సూర్య ముందుకు సాగుతున్నాడు.

