Ishan Kishan: శ్రేయస్‌ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ishan Kishan Shreyas Iyer

Ishan Kishan Shreyas Iyer

Ishan Kishan on Shreyas Iyer Batting: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 14.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. భారత్ ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ అతడికి మంచి సహకారం అందించాడు. ముఖ్యంగా శ్రేయస్ మంచి టచ్‌లో ఉన్నాడని భావించిన ఇషాన్.. అతడికే ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై ఇషాన్ స్పందించాడు.

‘శ్రేయస్ అయ్యర్ మంచి టచ్‌లో ఉన్నాడు. మరో ఎండ్‌ నుంచి చూస్తున్నప్పుడు అతడిని స్ట్రైక్‌లో ఉంచడం, ఆ జోరును ఆపకుండా చూడటం మంచిదనిపించింది. అందుకే నేను ఎక్కువగా స్ట్రైక్‌ తీసుకోలేదు. శ్రేయస్ వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడే అవకాశం ఇవ్వాలని భావించాను. భాగస్వామ్యంలో ఎప్పుడు బ్యాక్‌సీట్ తీసుకోవాలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. మరో ఎండ్‌ బ్యాటర్ బంతిని ఎలా టైమింగ్ చేస్తున్నాడో చూస్తాను. నేను బాగా ఆడుతున్నానా లేదా అతడే మెరుగ్గా ఆడుతున్నాడా అనేది ఇట్టే అర్థమవుతుంది. ఈ రోజు శ్రేయస్ చాలా మంచి టచ్‌లో ఉన్నాడు. నిజం చెప్పాలంటే నేను అంత గొప్పగా కనిపించలేదు. అందుకే అతడిని స్ట్రైక్‌లో ఉంచడమే మంచిదనుకున్నాను. నేనే స్ట్రైక్‌లో ఉండి అనవసరమైన షాట్లు ఆడటం కంటే.. అతడి జోరు కొనసాగడం ముఖ్యం అనిపించింది’ అని ఇషాన్ వివరించాడు.

మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ పట్టిన అద్భుత క్యాచ్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. లైట్ల వెలుతురులో బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయానని ఇషాన్ తెలిపాడు. ‘బంతి నేరుగా ఫ్లడ్ లైట్ల వెలుతురు పై నుంచి రావడంతో సరిగ్గా జడ్జ్ చేయలేకపోయాను. అయితే బంతి నా నడుము దగ్గరికి వచ్చే అవకాశం ఉందనే చిన్న ఊహ వచ్చింది. వెంటనే దాని కోసం వెళ్లాను. చివరికి బంతి నా చేతిలోనే పడటం చాలా సంతోషంగా అనిపించింది’ అని ఇషాన్ పేర్కొన్నాడు. కేవలం 24 గంటల వ్యవధిలోనే జట్టు మళ్లీ కలసి మ్యాచ్ ఆడాల్సి రావడం, ఆటగాళ్ల శారీరక పరిస్థితి ఎలా ఉందనే ప్రశ్నకు.. ఒత్తిడి, తక్కువ సమయం వంటి పరిస్థితులు క్రికెట్‌లో సహజమేనని.. అయితే జాతీయ జట్టు జెర్సీ ధరించిన తర్వాత తమ వంతు వంద శాతం కష్టపడటం బాధ్యత అని చెప్పాడు.

‘ఇలాంటి పరిస్థితులు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కువ సమయం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడిలో ఆడాల్సి వస్తుంది. కానీ వెస్టిండీస్ ఇటీవల ఆడుతున్న తీరును కూడా మేము చూశాం. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత, ముఖ్యంగా భారత జెర్సీ ధరించినప్పుడు, మన వంతు సహకారం పూర్తిగా ఇవ్వాలి. కొన్ని రోజులు మనకు అసౌకర్యంగా ఉండొచ్చు. అయినప్పటికీ 100 శాతం ఇవ్వడం మన బాధ్యత’ అని ఇషాన్ కిషన్ చెప్పాడు. తొలి టీ20లో భారత్ సమష్టిగా రాణించడంతో వెస్టిండీస్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో శ్రేయస్ జోరును కొనసాగించేందుకు ఇషాన్ తీసుకున్న నిర్ణయం.. భాగస్వామ్యంలో పరిస్థితులకు అనుగుణంగా ఆడటం ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పింది.