NTV Telugu Site icon

Irfan Pathan: అత్యుత్తమ ఐపీఎల్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలుసా?

Irfan Pathan Best Eleven

Irfan Pathan Best Eleven

ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత.. మాజీలందరూ తమతమ ఉత్తమ ఆటగాళ్ళని ఎంపిక చేసుకొని, ఒక బెస్ట్ టీమ్‌ని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2022 ముగియడంతో.. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన బెస్ట్ ఎలెవన్‌ను అనౌన్స్ చేశాడు. ఇతను హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. హార్దిక్ సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. తొలి సీజన్‌లోనే కప్ నెగ్గడంతో సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథిగా తన జట్టుని సమర్థవంతంగా నడిపించాడంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇర్ఫాన్ తను ఎంపిక చేసిన జట్టుకి హార్దిక్‌ని కెప్టెన్‌గా నియమించినట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా జోస్‌ బట్లర్‌, కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసిన ఆయన.. మూడు, నాలుగు స్థానాల్లో సంజూ శాంసన్‌, హార్ధిక్‌ పాండ్యాకు చోటు ఇచ్చాడు. అలాగే ఐదు, ఆరు స్థానాల్లో లాయమ్‌ లివింగ్‌ స్టోన్‌, డేవిడ్‌ మిల్లర్‌కు చోటు దక్కింది. ఇక బౌలింగ్‌ ఆల్‌ రౌండర్లుగా రషీద్‌ ఖాన్‌,హార్షల్‌ పటేల్‌ను సెలెక్ట్ చేశాడు. కేవలం బౌలర్ల కోటాలో మహ్మద్‌ షమీ, యజువేంద్ర చాహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం ఇచ్చాడు. అంతేకాదు.. ఈ జట్టులో 12వ ఆటగాడిగా స్పిన్నర్‌ కుల్ధీప్‌ యాదవ్‌ ఎంపిక చేశాడు. ఈ సీజన్‌లో ఈ వెటరన్ క్రికెటర్ మెరవడంతో.. ఇర్ఫాన్ అతడికీ తన జట్టులో చోటిచ్చినట్టు స్పష్టమవుతోంది.

ఇర్ఫాన్ ఎంపిక చేసిన బెస్ట్‌ ఎలెవన్‌: జోస్ బట్లర్, కేఎల్‌ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ (12వ ఆటగాడు- కుల్దీప్ యాదవ్). కాగా.. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేయగా, గుజరాత్ టైటాన్స్ ఇంకా 11 బంతులు మిగిలుండగానే 3 వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని చేధించింది.

Show comments