NTV Telugu Site icon

Irfan Pathan: ఉమ్రాన్‌ను అరంగేట్రం చేయనివ్వండి, వరల్డ్‌కప్ తర్వాత ఆలోచిద్దాం

Irfan On Umran

Irfan On Umran

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లు తీయడంతో పాటు నిలకడగా 150 కి.మీల వేగంతో బంతులు వేయడంతో.. రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో అతడ్ని టీమిండియాలోకి తీసుకోవాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు మాజీలు సైతం అతడ్ని తుది జట్టులో ఎంపిక చేయాల్సిందేనని సిఫార్సు చేస్తున్నారు. అయితే.. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ క్రీడా ఛానల్ చర్చలో భాగంగా ఉమ్రాన్ గురించి మాట్లాడుతూ.. ముందు అతడ్ని అరంగేట్రం చేయనివ్వండి, ఆ తర్వాత వరల్డ్‌కప్ గురించి ఆలోచిద్దామంటూ బదులిచ్చాడు.

‘‘ఉమ్రాన్ ఇంకా అంతర్జాతీయ క్రీడల్లో అరంగేట్రమే చేయలేదు. ముందుగా అతడ్ని అరంగేట్రం చేయనివ్వండి, ఆ తర్వాత అతడు భారత్ తరఫున ఎలా ప్రదర్శన కనబరుస్తున్నాడన్నది పరిశీలించాలి. బాగా ఆడితే ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయాలి’’ అని ఇర్పాన్ అన్నాడు. అయితే.. అతడు అరంగేట్రం చేశాక సరిగ్గా ప్రదర్శించకపోతే, పక్కన మాత్రం పెట్టొద్దని సూచిస్తున్నాడు. ఇప్పటివరకూ 150 కి.మీ. వేగంతో బౌలింగ్ వేసే బౌలర్ టీమిండియాకు దొరకలేదని, ఉమ్రాన్‌ని దీర్ఘకాలం రాణించేలా కాపాడుకోవాలని అన్నాడు. అతడి శక్తి సామర్థ్యాలను, ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా గమనించాలని పేర్కొన్నాడు. అతనికి మరింత మెరుగ్గా శిక్షణ ఇచ్చి ప్రోత్సాహించాలని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.

కాగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఉమ్రాన్‌కు భారత జట్టులో చోటైతే దక్కింది కానీ, బెంచ్‌కే పరిమితమయ్యాడు. త్వరలోనే ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా అతడు ఎంపికయ్యాడు. మరి, ఈ సిరీస్‌లో అయినా అతనికి అవకాశం వస్తుందో లేదో చూడాలి. మరో విషయం.. ఉమ్రాన్‌కు జమ్మూలో శిక్షణ ఇచ్చింది ఇర్ఫాన్ పఠానే! అతని ప్రోత్సాహం వల్లే ఉమ్రాన్ వేగవంతమైన పేసర్‌గా రాణిస్తున్నాడు.