ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ప్రత్యేక స్థానం ఉంది.. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఆ జట్టులో ఉండడం ఓ ఎత్తు అయితే.. ఏకంగా ఐదు సార్లు టైటిల్ గెలిచి సత్తా చాటింది ఆ జట్టు.. అయితే, లాస్ట్ సీజన్‌లో తడబడింది.. ధోనీ వస్తాడు.. మంచి ఫినిష్ ఇస్తాడు అని CSK ఫ్యాన్స్ ఎదురు చూసినా అది సాధ్యపడలేదు.. అయితే, ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీఎస్‌కే ఈ నియామకాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
‘Left Arm “Taking” Over! Welcoming Zaheer Khan as the Head Coach of Chennai Super Kings!’ అంటూ సీఎస్‌కే తన అధికారిక ప్రకటనలో జహీర్ ఖాన్‌కు స్వాగతం పలికింది. దీంతో IPL 2027 సీజన్‌లో జహీర్ ఖాన్ తొలిసారిగా సీఎస్‌కే ప్రధాన కోచ్ బాధ్యతలను చేపట్టనున్నారు. ఇటీవల సీఎస్‌కే, దీర్ఘకాలంగా హెడ్ కోచ్‌గా కొనసాగిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో విడిపోయింది. 2026 సీజన్ అనంతరం ఫ్లెమింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త కోచ్ ఎంపికపై ఆసక్తి నెలకొంది. 2009 నుంచి సీఎస్‌కే కోచ్‌గా ఉన్న ఫ్లెమింగ్‌తో ఫ్రాంచైజీకి సుదీర్ఘ అనుబంధం ఉంది.
భారత మాజీ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన జహీర్ ఖాన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం ఉంది. ఇప్పుడు ఆ అనుభవాన్ని సీఎస్‌కే కోచింగ్‌లో ఉపయోగించనున్నారు. IPL 2027 కోసం జట్టు నిర్మాణం, ఆటగాళ్ల సన్నాహాలు, వ్యూహాల రూపకల్పనలో ఆయన పాత్ర కీలకంగా ఉండనుంది. సీఎస్‌కే ఇప్పటివరకు 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచింది.. ఐపీఎల్‌లో ముంబై కూడా ఐదు సార్లు టైటిళ్లు గెలిచిన విషయం విదితమే.. మొత్తంగా జహీర్ ఖాన్ నియామకంతో ఫ్లెమింగ్ శకం తర్వాత సీఎస్‌కేలో కొత్త కోచింగ్ అధ్యాయం ప్రారంభమైనట్టైంది.
Left Arm “Taking” Over! 💫🦁
Welcoming Zaheer Khan as the Head Coach of Chennai Super Kings!#WhistlePodu #Yellove 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) September 21, 2026

