Vaibhav Sooryavanshi Weakness: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మంచి ఆరంభం చేసినప్పటికీ.. భారీ ఇన్నింగ్స్‌గా మార్చుకోలేకపోయాడు. కేవలం 21 బంతుల్లో 46 పరుగులు చేసిన వైభవ్.. ఢిల్లీ అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ వేసిన స్లో బంతికి ఔటయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. వైభవ్ బలహీనతను బౌలర్లు కనిపెట్టారా?, స్లో బాల్స్‌తో అతడిని కట్టడి చేయొచ్చా? అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు చర్చించుకుంటున్నారు.
ఈ విషయంపై రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీకి స్లో బాల్స్ బలహీనత కాదని స్పష్టం చేశాడు. ‘ప్రపంచంలో ఎవ్వరూ పరిపూర్ణులు కాదు. ప్రతి ఆటగాడికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ వైభవ్‌కు స్లో బాల్స్ పెద్ద సమస్య అని నేను అనుకోవడం లేదు. ఈ తరహా పిచ్‌లపై పేస్ తగ్గించి బౌలింగ్ చేయడం ఏ బ్యాటర్‌కైనా కష్టమే. ఢిల్లీ పిచ్‌లో బంతి కాస్త గ్రిప్ అవుతోంది. అందుకే బౌలింగ్‌లో మార్పులు చేయడం ఫలించింది. అది వైభవ్‌కే కాదు.. ఎవరికైనా అలాగే ఉంటుంది’ అని రాథోర్ తెలిపాడు.
వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ఇప్పటికే చాలామంది ప్రశంసలు కురిపించారని విక్రమ్ రాథోర్ చెప్పాడు. ‘వైభవ్ స్పెషల్ ప్లేయర్. అతడి సామర్థ్యం గురించి ఇప్పటికే చాలానే మాట్లాడారు. మరోసారి జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. త్వరలోనే అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం నాకు ఉంది. వైభవ్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో, ఎలా సిద్ధమవుతున్నాడో చూస్తే.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మేము వైభవ్ ఇలాగే దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నాం. ప్రతి ఆటగాడి శైలి వేరుగా ఉంటుంది. వైభవ్‌లా ధృవ్ జురెల్ ఆడాల్సిన అవసరం లేదు. వైభవ్ కూడా ధృవ్‌లా ఆడాలని చూడకూడదు. ఇద్దరికీ వారి వారి బలాలు ఉన్నాయి. తమ బలాలపై నమ్మకం ఉంచుకుని ఆడితేనే విజయాలు సాధించగలరు’ అని పేర్కొన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఆడలేదు. టాస్ సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా జడేజాకు విశ్రాంతి ఇచ్చామని చెప్పగా.. విక్రమ్ రాథోర్ మాత్రం మోకాలిలో స్వల్ప గాయం ఉందని వెల్లడించాడు. ‘జడేజా మోకాలిలో చిన్న ఇబ్బంది ఉంది. మరో మ్యాచ్ విశ్రాంతి ఇస్తే మంచిదని భావించాం. అందుకే ఈ మ్యాచ్‌లో ఆడలేదని’ అని తెలిపాడు. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారిన నేపథ్యంలో రాయల్స్‌కు మిగిలిన రెండు మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి. టాప్-4లో నిలవాలంటే రెండు మ్యాచ్‌ల్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.
