SRH vs RR Eliminator: ఎవరి బలహీనత వారికే ముప్పు.. ఎలిమినేటర్ మ్యాచ్‌పై ఆసక్తికర విశ్లేషణ!

  • ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధం
  • గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత
  • ఎలిమినేటర్ మ్యాచ్‌పై ఆసక్తికర విశ్లేషణ
Srh Vs Rr Eliminator

Srh Vs Rr Eliminator

SRH and RR Weakness ahead of IPL 2026 Eliminator: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. న్యూ చండీగఢ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు మరికొన్ని గంటల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఎవరు ప్రత్యర్థి బలహీనతలను బాగా ఉపయోగించుకుంటారన్నదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది.

రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో ప్రధానంగా ఓపెనర్లపైనే ఆధారపడుతోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు యశస్వి జైస్వాల్ జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు ఆర్ఆర్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. కానీ ఓపెనర్లు త్వరగా ఔటైతే మాత్రం ఆర్ఆర్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలుతోంది. మిడిల్ ఆర్డర్, ఫినిషర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. కీలక మ్యాచ్‌ల్లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, ఫెరీరా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు.

ఈ బలహీనత తెలిసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సరైన వ్యూహంతో బరిలోకి దిగనుంది. పవర్‌ప్లేలోనే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వికెట్లు పడగొడితే.. మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించవచ్చని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు సార్లు రాజస్థాన్‌ను ఓడించిన హైదరాబాద్.. అదే ప్లాన్‌తో మళ్లీ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆర్ఆర్ బౌలింగ్ కూడా పూర్తిగా జోఫ్రా ఆర్చర్‌పైనే ఆధారపడుతోంది. ఆర్చర్ వికెట్లు తీస్తేనే ఆర్ఆర్‌ మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అతడు విఫలమైతే మిగతా బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకర జట్టుగా నిలిచింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి విధ్వంసక బ్యాటర్లతో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఆ నలుగురు ప్రత్యర్థి బౌలర్లకు పెను సవాలుగా మారారు. భారీ స్కోర్లు చేయడంలో హైదరాబాద్‌కు తిరుగులేదని ఇప్పటికే పలు మ్యాచ్‌లు నిరూపించాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వం కూడా జట్టుకు పెద్ద బలంగా మారింది.

అయితే ఎస్ఆర్‌హెచ్‌కు కూడా ఒక బలహీనత ఉంది. అదే పసలేని బౌలింగ్. అనుభవం ఉన్న బౌలర్లు జట్టులో లేరు. కమిన్స్ తప్ప మిగతా బౌలర్లు ఒత్తిడి మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో లైన్ అండ్ లెంగ్త్ కోల్పోతున్నారు. అదే ఆర్ఆర్‌కు ఆశాకిరణంగా కనిపిస్తోంది. వైభవ్, జైస్వాల్ మంచి ఆరంభం అందిస్తే.. హైదరాబాద్ యువ బౌలర్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బ్యాటింగ్ దాడి, బౌలింగ్ వ్యూహాలు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కీలకంగా మారనున్నాయి. ఒకవైపు పవర్ హిట్టింగ్‌తో ఎస్ఆర్‌హెచ్.. మరోవైపు యువ సంచలనాలతో ఆర్ఆర్ అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్ అందించేందుకు సిద్ధమయ్యాయి.