టోర్నీ తొలి అర్ధభాగంలో తమ జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడని, ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయన్నాడు. ఇటీవలి రెండు మ్యాచ్‌ల్లో తాము విజయానికి దగ్గరగా వచ్చామని, కానీ జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం గెలవాల్సిందే అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. వరుసగా ఆరు ఓటములతో సతమతమైన బెంగళూరు.. ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వారి సొంతగడ్డపై 35 పరుగుల తేడాతో ఓడించింది.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ… ‘గత రెండు మ్యాచ్‌ల్లోనూ మేం గొప్పగా పోరాడాం. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్ష్యం 270కి పైగా ఉంటే.. 260 పరుగులు చేశాం. కోల్‌కతాపై ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో మేం విజయానికి చాలా దగ్గరగా వచ్చాం. అయితే జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం విజయం సాదించాల్సిందే. మాటలతో ఎవరిలోనూ విశ్వాసం పెంచలేం. మన ప్రదర్శనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’ అని అన్నాడు.
Also Read: Vijaysai Reddy: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా!
‘టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయి. మనం 100శాతం ప్రదర్శన ఇవ్వకపోతే బాధపడాల్సి వస్తుంది. టోర్నీ తొలి అర్ధభాగంలో మా జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు. ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారు. కామెరూన్ గ్రీన్ ఫామ్‌లోకి రావడం జట్టుకు అదనపు బలం’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం కోహ్లీ వద్దే ఉంది. ఈ సీజన్‌లో అతడు 430 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో విరాట్ 400 రన్స్ మార్క్ దాటడం ఇది పదోసారి కావడం విశేషం.