Pat Cummins Says SRH will have a crack Qualifier 2: క్వాలిఫయర్-1లో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు. క్వాలిఫయర్-2 రూపంలో తమకు మరో అవకాశం ఉందని, కచ్చితంగా ఫైనల్ వెళతామని ధీమా వ్యక్తం చేశాడు. నిజానికి తాము సన్వీర్ సింగ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనుకోలేదని, ఎక్స్‌ట్రా బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్‌ను బరిలోకి దించాలనుకున్నామని కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ఎస్ఆర్‌హెచ్ 8 వికెట్ల తేడాతో ఓడింది. ఈ ఓటమితో నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ఈ పరాజయాన్ని త్వరగా మరిచిపోవాలి. ఎందుకంటే.. మాకు క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. టీ20 క్రికెట్‌లో అన్ని రోజులు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మేం బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. దాంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయాం. బంతితోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ వికెట్‌పై అదనపు బ్యాటర్ అవసరం అని భావించాం. నిజానికి సన్వీర్ సింగ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనుకోలేదు. ఎక్స్‌ట్రా బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించాలనుకున్నాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్వీర్ సింగ్‌ను బరిలోకి దించాం’ అని తెలిపాడు.
‘కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మ్యాచ్ ఆరంభంలో కొద్దిగా మంచు ఉంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. క్వాలిఫయర్-2 కోసం కొత్త వేదిక (చెన్నై)కు వెళుతుండడం మాకు కలిసొచ్చే అంశం. ఈ ఓటమిని మరిచి ముందుకు సాగాలి. క్వాలిఫయర్-2 విజయం సాధిస్తాం’ అని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య చేధనలో కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది.