Sachin Tendulkar Praises SRH Batting: సొంత మైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) గర్జించింది. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (75 నాటౌట్: 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (89 నాటౌట్: 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు విజయాన్ని అందించారు. 166 పరుగుల లక్షాన్ని హైదరాబాద్ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 167 రన్స్ చేసి విజయం సాధించింది. అభిషేక్, హెడ్‌లు పవర్ ప్లేలోనే 100కిపైగా పరుగులు చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్ అలవోకగా విజయం సాధించింది.
Also Read: Passengers Fighting: విమానంలో తెగ కొట్టేసుకున్న ప్రయాణికులు.. వైరల్ వీడియో..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల బాదుడును చూసిన టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ ప్రత్యేకంగా అభినందించారు. విధ్వంసకరమైన ఓపెనింగ్ భాగస్వామ్యం అని, ఉప్పల్‌లో ఈ మ్యాచ్ చూడటం బాగుందన్నారు. ‘విధ్వంసకరమైన ఓపెనింగ్ భాగస్వామ్యం. ఉప్పల్ మైదానంలో ఈ మ్యాచ్ చూడటం చాలా బాగుంది. ఒకవేళ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే.. తప్పకుండా 300 స్కోరు చూసేవాళ్లమే’ అని సచిన్ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. ‘ఐపీఎల్‌లోనే అత్యుత్తమ మ్యాచ్ చూశాం’, ‘హైదరాబాద్ ఛేదనను కేవలం 40 నిమిషాల్లోనే పూర్తి చేసింది’ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.