Pat Cummins on RCB vs SRH IPL 2024 Match: తమ ప్లేయర్ల ఆట చూస్తుంటే తానూ బ్యాటర్ అయితే బాగుండనిపించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరదాగా వ్యాఖ్యానించాడు. సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో విజయం అని, తనకు చాలా చాలా సంతోషంగా ఉందన్నాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (287)ను నమోదు చేసింది. ఈ మ్యాచ్ అభిమానులను మాత్రమే కాదు.. ఆటగాళ్లను కూడా కనువిందు చేసింది.
మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ప్లేయర్ల ఆట చూసి నేనూ బ్యాటర్ అయితే బాగుండనిపించింది. క్రికెట్ ఆటలో ఇదొక అద్భుతమైన గేమ్. కళ్లు చెదిరే దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. విజయం కోసం ప్రతి ప్లేయర్ తమ వంతు ప్రయత్నం చేయాలి. నేను వికెట్‌ను చదివే ప్రయత్నం చేయలేదు. చిన్నస్వామి పిచ్ డ్రైగా అనిపించింది. ఇది నాలుగో విజయం. చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటర్లు అలవోకగా ఆడేశారు. అందరి ముఖాల్లో చిరునవ్వు విరబూసింది’ అని అన్నాడు.
Also Read: Glenn Maxwell-IPL 2024: ఐపీఎల్ మధ్యలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలక నిర్ణయం!
ఇలా పరుగుల వరద పారిస్తే బౌలర్లు కనుమరుగవుతారు? కదా అనే ప్రశ్నకు ప్యాట్ కమిన్స్ బదులిస్తూ… ‘ నాలాంటి బౌలర్లను మరికొన్నేళ్లు ఆడనివ్వండి. నా ప్రయత్నం నేను చేశా. ఒక్క ఓవర్‌లో 7 లేదా 8 పరుగులు మాత్రమే ఇవ్వగలిగితే మ్యాచ్‌పై ప్రభావం చూపొచ్చు’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (102; 41 బంతుల్లో 9×4, 8×6) శతకం చేసే.. హెన్రిచ్ క్లాసెన్ (67; 31 బంతుల్లో 2×4, 7×6) హాఫ్ సెంచరీ బాదాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (62; 28 బంతుల్లో 7×4, 4×6), దినేశ్ కార్తీక్ (83; 35 బంతుల్లో 5×4, 7×6) సంచలన ఇన్నింగ్స్ ఆడారు.