NTV Telugu Site icon

RCB vs RR: రాజస్థాన్‌ చేతిలో ఓటమి.. ఐపీఎల్ 2024 నుంచి బెంగళూరు ఔట్‌!

Rcb Vs Rr

Rcb Vs Rr

RR fine show to knock RCB out: ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. బెంగళూరు నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (45; 30 బంతుల్లో 8×4), రియాన్‌ పరాగ్‌ (36; 26 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. ఈ విజయంతో ఆర్ఆర్ క్వాలిఫయర్‌-2కు చేరగా.. ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం చెపాక్‌లో సన్‌రైజర్స్‌తో రాజస్థాన్‌ తలపడుతుంది.

ఎలిమినేటర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్ల దూకుడుకు ట్రెంట్ బౌల్ట్‌ కళ్లెం వేశాడు. పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ (3-0-6-1) చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్‌ (17) ఔట్ అయినా.. పవర్‌ప్లేలో 50 పరుగులు చేసిందంటే అందుకు కారణం విరాట్ కోహ్లీనే. అయితే స్పిన్నర్ల రాకతో బెంగళూరు ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. కెమరూన్ గ్రీన్‌ (27) పెద్దగా ప్రభావం చూపలేదు. కొద్ది వ్యవధిలోనే కోహ్లీ (33; 24 బంతుల్లో 3×4, 1×6), గ్రీన్‌ సహా మ్యాక్స్‌వెల్‌ (0) పెవిలియన్ చేరారు. ఈ సమయంలో రజత్‌ పటీదార్‌ (34; 22 బంతుల్లో 2×4, 2×6), మహిపాల్‌ లొమ్రార్‌ (32; 17 బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించారు. దినేశ్‌ కార్తీక్‌ (11) నెమ్మదిగా ఆడినా.. స్వప్నిల్‌ (9 నాటౌట్‌) సిక్సర్‌తో స్కోరు 170 దాటింది.

Also Read: Prabhas : ‘బుజ్జి’ పేరు చిన్నగా వున్నా.. మా సినిమాకి ఎంతో స్పెషల్..

ఛేదనలో రాజస్థాన్‌కు తొలి రెండు ఓవర్లలో 6 పరుగులే వచ్చాయి. యశ్‌ దయాళ్ బౌలింగ్‌లో జైస్వాల్‌ క్యాచ్‌ను గ్రీన్‌ అందుకోలేదు. యశ్‌ వేసిన తర్వాతి ఓవర్లో కాడ్మోర్‌ (20) ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ వదిలేశాడు. ఆ వెంటనే స్లో యార్కర్‌తో కాడ్మోర్‌ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేసినా.. శాంసన్‌ (17) అండగా జైస్వాల్‌ బౌండరీలు బాదాడు. గ్రీన్‌ ఓవర్లో స్కూప్‌కు ప్రయత్నించిన జైస్వాల్‌ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే శాంసన్‌ పెవిలియన్ చేరడంతో బెంగళూరు పోటీలోకి వచ్చింది. కాసేపటికే కోహ్లీ అద్భుత త్రోకు జూరెల్‌ (8) రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో రాజస్థాన్‌ విజయ సమీకరణం 30 బంతుల్లో 47 పరుగులుగా మారింది. ఈ సమయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ హెట్‌మయర్‌ (26), పరాగ్‌ బౌండరీలు, సిక్సులు బడడంతో సమీకరణం 18 బంతుల్లో 19 పరుగులుగా మారింది. 18వ ఓవర్లో పరాగ్, హెట్‌మయర్‌ను ఔట్‌ చేసిన సిరాజ్‌.. 6 పరుగులే ఇచ్చి ఆశలు రేపాడు. కానీ ఫెర్గూసన్‌ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో పావెల్‌ (16 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశాడు.