Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

  • శ్రేయాస్ నాయకత్వంపై పంజాబ్ ఆటగాళ్ల ప్రశంసలు
  • శ్రేయాస్ బెస్ట్ కెప్టెన్ అంటున్న ప్రభ్‌సిమ్రన్
  • నా సక్సెస్‌కు కారణం శ్రేయాస్
Prabhsimran Singh, Shreyas Iyer

Prabhsimran Singh, Shreyas Iyer

పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంపై ఆ జట్టు ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్.. అయ్యర్ కెప్టెన్సీపై స్పందించాడు. జట్టులో ప్రతి ఒక్కరి పాత్రపై స్పష్టత ఇచ్చిన విధానం, ఆటగాళ్లకు అందిస్తున్న మద్దతు అతడిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని పేర్కొన్నాడు. తన సక్సెస్‌కు కారణం శ్రేయాస్ అని చెప్పాడు. టెన్షన్ వద్దని, స్వేచ్ఛగా ఆడమని తనకు చెప్పాడని ప్రభ్‌సిమ్రన్ చెప్పుకొచ్చాడు.

ప్రభ్‌సిమ్రన్ సింగ్ మాట్లాడుతూ… ‘2025లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్లేయర్-కెప్టెన్ మీటింగ్‌ జరిగింది. ఆ మీటింగ్‌లో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఎలా ఆడాలనుకుంటే అలా ఆడు, నేను నిన్ను సీనియర్ ప్లేయర్‌గా చూస్తున్నా అని అయ్యర్ చెప్పిన మాటలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆ నమ్మకమే నా ఆటను మెరుగుపరచడానికి సహాయపడింది. ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోయినా వారిని ప్రోత్సహించడం అయ్యర్ శైలి. కొన్ని మ్యాచ్‌లలో రన్స్ చేయలేకపోయినా ఒత్తిడి పెట్టకుండా, దగ్గరకు వచ్చి మాట్లాడి ధైర్యం చెబుతాడు. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు.. ఆటలో నీ సామర్థ్యాన్ని చూపించు అని చెబుతాడు’ అని చెప్పాడు.

ఓ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఆటగాళ్లలో నమ్మకం పెంచుతాడు. పూర్తి మద్దతు ఇస్తాడు. అందుకే పంజాబ్ ఆటగాళ్లు రాణిస్తున్నారు. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన కెప్టెన్లలో శ్రేయాస్ బెస్ట్ కెప్టెన్. ఆటగాళ్లకు పూర్తి మద్దతు ఇవ్వడం, ఒత్తిడిని తగ్గించడం, స్వేచ్ఛనివ్వడం వంటి లక్షణాల వల్లే అయ్యర్ నాయకత్వం ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని ప్రభ్‌సిమ్రన్ సింగ్ చెప్పుకొచ్చాడు. జట్టు విజయంలో కెప్టెన్ పాత్ర ఎంత ముఖ్యమో ప్రభ్‌సిమ్రన్ వ్యాఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025లో పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయాస్ బాధ్యతలు చేపట్టి.. మొదటి ఏడాదిలోనే ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈ ఏడాదిలో కూడా జట్టును టైటిల్ దిశగా తీసుకెళుతున్నాడు.