ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టులో ప్రస్తుత పరిస్థితులు సవ్యంగా లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా విభేదాలు తలెత్తుతున్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. జట్టు ప్రదర్శనపై యజమాని నీతా అంబానీ అసంతృప్తిగా ఉన్నారట. ముంబై డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితిని ఆమె నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం.
జట్టులోని సీనియర్ ఆటగాళ్ల మధ్య ‘ఈగో క్లాష్’లు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య జరిగిన వాగ్వాదం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఫీల్డ్ సెట్టింగ్ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన చర్చ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. హార్దిక్ ఫైర్ కాగా.. బుమ్రా వెన్నక్కి తగ్గడంతో పెద్ద ఉద్రిక్తత తప్పింది.
జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్య నాయకత్వంలో ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ విషయాన్ని వారు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. జట్టులో సమన్వయం లోపించడం వల్లే ఫలితాలు కూడా దెబ్బతింటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ అనంతరం హార్దిక్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి. జట్టు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు సీనియర్ ఆటగాళ్లలో మార్పులు జరగవచ్చనే సంకేతాలు ఇస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం కేవలం మైదానంలోనే కాకుండా, జట్టు అంతర్గతంగా కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ముంబై జట్టు ఎలా బయటపడుతుంది?, మళ్లీ గెలుపు బాట పట్టగలదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం ముంబై త్వరగా సమస్యలను పరిష్కరించి.. తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆశిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో ఒకటే గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమవుతున్న ముంబై.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమ్మర్శలు వస్తున్నాయి.
