NTV Telugu Site icon

MI vs SRH: కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్‌ 174!

Pat Cummins Batting

Pat Cummins Batting

వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారీ స్కోర్ సాదిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్‌ ట్రావిస్ హెడ్‌ (48) టాప్‌ స్కోరర్‌. ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ (35; 17 బంతుల్లో 2×4, 2×6) మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ పోరాడే స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో పీయూష్‌ చావ్లా, హార్దిక్‌ పాండ్యా చెరో 3 వికెట్లు పడగొట్టారు.

ముంబై గ‌డ్డ‌పై స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు తేలిపోయారు. బౌలింగ్‌కు అనుకూలించిన వాంఖ‌డే పిచ్‌పై దంచ‌లేక.. వరుసగా డ‌గౌట్‌కు క్యూ క‌ట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్‌కు శుభారంభం దక్కలేదు. ప‌వ‌ర్ ప్లేలో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌(11)ను జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ (5)ను అరంగేట్ర ఆటగాడు కంబోజీ బౌల్డ్ చేశాడు. దాంతో హైద‌రాబాద్ స్కోర్ వేగం త‌గ్గింది. ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ (20)లు ధాటిగా ఆడే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈ జోడిని హార్దిక్ పాండ్యా విడదీశాడు.

Also Read: Preity Zinta: ఎంఎస్ ధోనీ సిక్స్‌లు కొట్టలేదు.. పంజాబ్ గెలువలేదు: ప్రీతి జింతా

కాసేప‌టికే పీయుష్ చావ్లా సూపర్ బ్రేక్ ఇచ్చాడు. డేంజ‌ర‌స్ ట్రావిస్ హెడ్‌, హెన్రిచ్ క్లాసెన్ (2)ల‌ను అతడు అవుట్ చేశాడు. దాంతో వంద లోపే ఐదు కీల‌క వికెట్లు కోల్పోయిన స‌న్‌రైజ‌ర్స్‌.. కష్టాల్లో పడింది. ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్ (10), మార్కో జాన్‌సెన్ (17)లు జ‌ట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే హార్దిక్ ఒకే ఓవ‌ర్లో ఈ ఇద్ద‌రిని వెన‌క్కి పంపాడు. ఈ సమయంలో క‌మిన్స్ చెలరేగాడు. తుషార వేసిన 20వ ఓవ‌ర్లో సిక్స‌ర్, ఫోర్ బాదాడు. దాంతో వాంఖ‌డేలో హైద‌రాబాద్ పోరాడ‌గ‌లిగే స్కోర్ చేయ‌గ‌లిగింది.