Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!

  • ఐపీఎల్ 2026లో సత్తాచాటుతున్న యువ ఆటగాళ్లు
  • అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మాధవ్ తివారీ
  • బ్యాటింగ్‌లో 18 నాటౌట్‌, బౌలింగ్‌లో 40/2
Madhav Tiwari Bowling

Madhav Tiwari Bowling

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో యువ ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. అద్భుత బ్యాటింగ్, బౌలింగ్‌తో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తరఫున ఆడుతున్న యువ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ తాజాగా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాట్, బాల్‌తో ఆకట్టుకున్న మాధవ్ తివారీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతడు.. ఈ అవకాశాన్ని ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. మాధవ్ బ్యాటింగ్‌లో (18 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4, 1×6), బౌలింగ్‌లో (40/2) మెరిశాడు.

‘ఈ అవకాశం ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్‌కు థ్యాంక్స్ చెప్పాలి. జట్టు విజయంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ప్లేయర్‌గా అవకాశాలు రావడం మన చేతుల్లో ఉండదు. కానీ ప్రతి ప్రాక్టీస్ సెషన్‌లో మెరుగుపడటమే నా టార్గెట్. మునాఫ్ పటేల్ సర్‌తో కలిసి బౌలింగ్‌లో చాలా కష్టపడ్డాను. బ్యాటింగ్ కోచ్‌తో కలిసి పవర్ హిట్టింగ్‌పై పని చేశాను. ఇవాళ ఆ శ్రమ జట్టుకు ఉపయోగపడగలిగినందుకు ఆనందంగా ఉంది’ అని మాధవ్ తివారీ తెలిపాడు. తాను బ్యాటర్‌నా? బౌలర్‌నా? అన్న ప్రశ్నకు మాధవ్ తివారీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నేను 100 శాతం బౌలర్, 100 శాతం బ్యాట్స్‌మన్’ అంటూ ధైర్యంగా చెప్పాడు.

మ్యాచ్ పరిస్థితుల గురించి మాధవ్ తివారీ మాట్లాడుతూ.. ‘ఈ వికెట్‌పై లెంగ్త్ బాల్స్‌కు సహకారం ఉంది. అందుకే మొదట్లో అదే ప్లాన్ ఫాలో అయ్యాను. మధ్యలో వైడ్ బాల్స్, షార్ట్ బాల్స్ కూడా మిక్స్ చేయడానికి ప్రయత్నించాను’ అని వివరించాడు. తనకు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం రావడం కాస్త ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపాడు. ‘నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉన్నాయి. రెండో ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇస్తే నేనే వచ్చి బౌలింగ్ చేస్తానని కెప్టెన్ అక్షర్ పటేల్ సరదాగా చెప్పాడు. అదృష్టవశాత్తూ నేను బాగా బౌలింగ్ చేశాను. నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా. అందులోనూ బాగా బంతులు వేశాను. చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

బ్యాటింగ్ విషయంలో కూడా కోచింగ్ స్టాఫ్ ఇచ్చిన సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని మాధవ్ వెల్లడించాడు. ‘మా బ్యాటింగ్ కోచ్ ఇయాన్ బెల్ ఒకటే చెప్పాడు. నీలో పవర్ ఉంది, అనవసరంగా ఫ్యాన్సీ షాట్లు ఆడొద్దు. బంతికి సరిగ్గా రియాక్ట్ అవ్వమన్నాడు. అదే నేను ఫాలో అయ్యాను. నేను ముందునుంచీ ఇదే మైండ్‌సెట్‌తో ఆడుతున్నాను. ఇవాళ అది క్లిక్ అయింది అంతే. క్రికెట్‌లో మంచి, చెడు దశలు సహజం. కానీ ప్రాసెస్‌ను కొనసాగించడం ముఖ్యం. ఈరోజు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఆ క్యాచ్ డ్రాప్ అయింది.. పరుగులు కూడా వచ్చాయి’ అని పేర్కొన్నాడు. మా బెంచ్ స్ట్రెంగ్త్ చాలా బలంగా ఉంది. యువ ఆటగాళ్లు కీలక సమయంలో బాధ్యత తీసుకోవడం జట్టుకు గొప్ప అనుకూలాంశం. బ్యాటింగ్, ఫీల్డింగ్, ఎనర్జీ.. ప్రతి విభాగంలో ఈ యువ ఆటగాళ్లు జట్టుకు ఉపయోగపడుతున్నారు. భవిష్యత్తులో ఢిల్లీ చాలా బలమైన జట్టుగా మారుతుంది’ అని మాధవ్ ధీమా వ్యక్తం చేశాడు.