Lucknow Super Giants Scored 63 Runs In First 10 Overs: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కష్టాల్లో ఉంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో జట్టు 5 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 64 పరుగులు చేయాల్సి ఉంటుంది. లక్ష్యం చిన్నదే అయినా.. ఐదు వికెట్లు పోయాయి కాబట్టి, ఆచితూచి ఆడాలి. వికెట్లు పడకుండా, జాగ్రత్తగా రాణించాలి. నిజానికి.. స్వల్ప లక్ష్యంతో లక్నో బరిలోకి దిగింది కాబట్టి, మ్యాచ్ వన్ సైడెడ్‌గా సాగుతుందని అందరూ అనుకున్నారు. పైగా ఇది లక్నోకి హోమ్‌గ్రౌండ్ కావడంతో, ఆడుతూ పాడుతూ లక్నో మ్యాచ్ ముగించేస్తుందని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. పవర్ ప్లేలోనే లక్నో జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. పూరన్ వచ్చి రాగానే సిక్స్ కొట్టడంతో.. అతడు మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ముగిస్తాడనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ.. అతడు భారీ షాట్ కొట్టబోయి, వెంటనే పెవిలియన్ చేరాడు.
అంతకుముందు.. విధ్వంసకర ఆటగాడు కైల్ మేయర్స్ అయితే సున్నా పరుగులకే వెనుదిరిగాడు. రెండో బంతికి అతడు షాట్ కొట్టబోగా.. అది 30 సర్కిల్ యార్డ్స్‌లో ఉన్న అనుజ్ రావత్ చేతిలోకి నేరుగా వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా.. మొదట్లో నిదానంగా తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా, ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు. హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. కానీ.. ఆ ఊపులోనే అతడు మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయుష్ బదోని సైతం ఆ వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. ఇక దీపక్ హుడా మరోసారి నిరాశపరిచాడు. ఇలా క్రీజులోకి అడుగుపెట్టినట్టే పెట్టి, అలా ఔటై వెళ్లిపోయాడు. చూస్తుంటే.. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ త్రిల్లింగ్‌గా సాగేలా కనిపిస్తోంది.
