KL Rahul on LSG Defeat vs DC: పవర్ ప్లేలో కీలక వికెట్లను చేజార్చుకోవడమే ఈ సీజన్‌లో తమను దెబ్బ కొట్టిందని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. మంచి ఆరంభాలు ఇవ్వలేకపోవడమే పాయింట్ల పట్టికలో వెనకపడ్డానికి కారణం అని చెప్పాడు. చివరి మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటాం అని రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ఢిల్లీ చేతిలో లక్నో ఓడిపోయింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ’40 ఓవర్ల పాటు పిచ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్‌ను త్వరగానే ఔట్ చేశాం. దాంతో పట్టు సాధించేందుకు ప్రయత్నించాం. కానీ షై హోప్, అభిషేక్ పోరెల్ దూకుడుగా ఆడి భారీ స్కోరు చేశారు. ఇక్కడ 200లకు పైగా లక్ష్యాన్ని ఛేదించవచ్చని మేం భావించాం. అయితే పవర్ ప్లేలో కీలక వికెట్లను చేజార్చుకోవడం దెబ్బ కొట్టింది. ఈ సీజన్‌లోనే మాకు అతిపెద్ద సమస్యగా మారింది. మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్‌లా చెలరేగి మంచి ఆరంభం ఇవ్వలేకపోతున్నాం. ఇదే మేం పాయింట్ల పట్టికలో వెనక బడడానికి కారణం. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటాం’ అని అన్నాడు.