NTV Telugu Site icon

Sunil Narine: టీమ్‌ మీటింగ్‌లకు సునీల్ నరైన్ రాడు: శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer Kkr

Shreyas Iyer Kkr

Shreyas Iyer Heap Praise on Sunil Narine: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 2024లో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారని ప్రశంసించాడు. టీమ్‌ మీటింగ్‌లకు సాల్ట్ వస్తాడని, నరైన్ రాడని చెప్పాడు. ఐపీఎల్‌ 17 సీజన్‌లో కోల్‌కతా ఓపెనర్లు సాల్ట్, నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఓపెనర్ల జోరుతో కోల్‌కతా ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి.. ప్లే ఆఫ్ దిశగా సూలుకెళుతోంది.

సోమవారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘గత కొన్ని మ్యాచ్‌లను పరిశీలిస్తే 200 స్కోరు తక్కువే అనిపిస్తోంది. పవర్‌ప్లే తర్వాత పిచ్ స్పిన్నర్లకు అనుకూలించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్ ఎలా ఉంటుంది, ఎలా ఆడాలనే విషయంలో మాకు సరైన అవగాహన ఉంది. సునీల్ నరైన్ టీమ్‌ మీటింగ్‌లకు రాడు. ఫిల్ సాల్ట్ మాత్రం వస్తాడు. నరైన్ పూర్తిగా ఆటలో నిమగ్నమై ఉంటాడు. అతడు ఆడుతున్న తీరు చూస్తే ఆనందం కలుగుతోంది’ అని అన్నాడు.

Also Read: T20 World Cup 2024: ప్రపంచకప్‌కు అతడిని సెలక్ట్ చేయండి.. బీసీసీఐకి షారుక్ ఖాన్ విజ్ఞప్తి!

‘ఒకవేళ సునీల్ నరైన్ టీమ్‌ మీటింగ్‌లకు వస్తే బాగా ఆటాడేమో. అందుకే నేను కూడా రావొద్దనే చెబుతా. వరుణ్‌ చక్రవర్తి గత కొన్ని మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడి నంచి మేం కోరుకునేది కూడా అదే. మేము ఎల్లప్పుడూ ప్లే ఆఫ్ చేరాలనే బరిలోకి దిగుతున్నాం. వీలైనంత త్వరగా అర్హత సాధించాలనేది మా లక్ష్యం. అయితే పాయింట్ల పట్టికను చూడకుండా.. మంచి ప్రదర్శన చేస్తే ఫలితం అదే వస్తుంది’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.