Ishan Kishan Sparks Controversy After SRH Win vs CSK at Chepauk: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా సోమవారం చెపాక్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్బుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సీఎస్‌కే అభిమానులను ఉద్దేశించి ‘విజిల్’ సంజ్ఞ చేస్తూ ‘ఇంటికి వెళ్లండి’ అన్నట్లుగా చేసిన చర్యపై తీవ్ర చర్చ జరుగుతోంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత చెపాక్ స్టేడియంలో ఉన్న సీఎస్‌కే అభిమానుల వైపు చూస్తూ.. ఇషాన్ కిషన్ వెకిలి చేష్టలు చేశాడు. తన చేతులతో ‘ఇంటికి వెళ్లండి’, ‘స్టేడియం ఖాళీ చేయండి’ అన్నట్లుగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇషాన్ చర్యపై సీఎస్‌కే అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీకి ఇది చివరి చెపాక్ మ్యాచ్ అయ్యే అవకాశముందని భావించిన అభిమానులు.. మ్యాచ్ అనంతరం తమ అభిమాన ఆటగాడికి ప్రత్యేకంగా వీడ్కోలు చెప్పేందుకు స్టేడియంలోనే ఉండిపోయారు. అలాంటి సమయంలో ఇషాన్ చేసిన చర్యలు క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నెటిజన్లు మండిపడుతున్నారు.
‘క్రికెట్ జెంటిల్‌మెన్ గేమ్. అభిమానులను గౌరవించాలి’, ‘గెలిచిన ఆనందంలో ఇలా ప్రవర్తించడం సరైంది కాదు’, ‘ఎంఎస్ ధోనీ అభిమానుల భావోద్వేగాలను గౌరవించాల్సింది’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారికంగా ఐపీఎల్ పాలక వర్గం, బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కావాలనే వెకిలి చేష్టలు చేసిన ఇషాన్‌పై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హైదెరాబాద్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇషాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 70 పరుగులు చేసి ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి ప్రధాన కారణమయ్యాడు.
Ishan Kishan be like: Anni muskuni intiki ***geyandi ani antunaduu😂 pic.twitter.com/W6AIQKyqap
— strawberry (@ndukuchepali) May 18, 2026
