Matheesha Pathirana Ruled Out Of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరుకోవడం దాదాపు ఖాయమైంది. ఈ రెండు జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి కీలక సమయంలో చెన్నైకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ మతీశా పతిరన 17వ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు తిరిగి తన స్వదేశానికి వెళ్ళిపోయాడట. ఐపీఎల్ 2024లో ఆరు మ్యాచ్‌లు ఆడి 7.68 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఉన్న నేపథ్యంలో గాయం తగ్గినా.. అతను భారతదేశానికి తిరిగి రాడు. ఏ దశలో అయినా ప్రత్యర్థికి కళ్లెం వేసి మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న పతిరన దూరమవ్వడం చెన్నైకి భారీ ఎదురుదెబ్బే.
Also Read: Ravindra Jadeja: రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర.. ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు బ్రేక్!
అంతర్జాతీయ క్రికెట్ కారణంగా ఇప్పటికే ముస్తాఫిజుర్ రెహ్మాన్ సేవలను చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోయింది. తాజాగా మతీశా పతిరన దూరమయ్యాడు. చెన్నై ఇప్పుడు ఇద్దరు అగ్రశ్రేణి అంతర్జాతీయ పేసర్లు లేకుండానే మొత్తం టోర్నమెంట్‌ను ఆడాల్సి ఉంది. ప్రస్తుతం చెన్నై 11 మ్యాచుల్లో ఆరు విజయాలను నమోదు చేసింది. 12 పాయింట్లతో ఇప్పుడు పట్టికలో మూడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుంది.