క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించడం ఒక ఎత్తైతే, వాటిని తిరగరాయడం మరో ఎత్తు. సాంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ల నుంచి నేటి ఆధునిక టీ20 యుగం వరకు ఎందరో దిగ్గజాలు అసాధ్యమనుకున్న మైలురాళ్లను సుసాధ్యం చేశారు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తొలి డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతాన్ని, అంతకంటే వేగవంతమైన టీ20 ఫార్మాట్‌లో సాధించాలని కంకణం కట్టుకున్నాడు ఒక 15 ఏళ్ల భారతీయ కుర్రాడు. అతడే జూనియర్ క్రికెట్, ఐపీఎల్‌లలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను వణకిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ‘డబుల్ సెంచరీ’ మార్కును అందుకోవడమే తన జీవిత ఆశయమని ఈ యువ కిశోరం బహిరంగంగా ప్రకటించాడు.
క్రిస్ గేల్ రికార్డుపై గురి..
ప్రస్తుతం అంతర్జాతీయ, లీగ్ క్రికెట్ కలిపి టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (175 నాటౌట్) పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గేల్ సృష్టించిన ఈ రికార్డు దశాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా ఉంది. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌తో వైభవ్ మాట్లాడుతూ.. తాను గేల్ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా 200 పరుగుల మైలురాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశాడు. “నేను గనుక మ్యాచ్‌లో పూర్తి 20 ఓవర్లు క్రీజులో నిలబడితే, ఆ రికార్డును ఖచ్చితంగా తిరగరాస్తాను” అని వైభవ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.
Vaibhav Sooryavanshi Wants To Score 200 Runs In T20! 🤯🔥
Chris Gayle Holds The Record At 175! 😅 pic.twitter.com/liNldqDn0k
— The Switch | Kevin Pietersen (@kptheswitch) May 25, 2026
రికార్డుల వేటగాడు..
ఈ 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ సాధించిన ఘనతలు అతని నమ్మకానికి అద్దం పడుతున్నాయి. గతంలో బీహార్ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో 190 పరుగులు, అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగులతో మెరిశాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై కేవలం 52 బంతుల్లోనే శతకం బాది, యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లోనూ 50కి పైగా సిక్సర్లతో చెలరేగుతూ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు.
చిన్న వయసులోనే సచిన్ టెండూల్కర్ వంటి భయం లేని మనస్తత్వంతో ఆడుతున్న వైభవ్, భవిష్యత్తులో భారత క్రికెట్ రాతను మార్చే ఆటగాడిగా కనిపిస్తున్నాడు. అతడిలోని ప్రతిభ, అంకితభావం చూస్తుంటే టీ20ల్లో ద్విశతకం అనే కల కేవలం ఊహ కాదని, త్వరలోనే అది నిజం కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యువ సంచలనం త్వరలోనే ఆ రికార్డును అందుకోవాలని ఆశిద్దాం.

