Rajasthan Royals: 12 ఏళ్ల రికార్డుకు చెక్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్.. చేతెలెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు..

Rr Batting

Rr Batting

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ కీలక పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్, పవర్‌ప్లే నుంచే పరుగుల వరద పారించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ నాకౌట్స్/ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యంత అరుదైన సరికొత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి ఏకంగా 136 పరుగులు రాబట్టింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ మొదటి 10 ఓవర్లలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. దీనికి ముందు, 2014 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తొలి 10 ఓవర్లలో చేసిన 122 పరుగుల రికార్డే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. ఇప్పుడు 12 ఏళ్ల నాటి ఆ రికార్డును చెరిపేస్తూ రాజస్థాన్ రాయల్స్ 136 పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ రికార్డు విధ్వంసంలో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ప్రైమ్ రోల్ పోషించాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 50) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి వీరబాదుడు వల్లనే రాజస్థాన్ రాయల్స్ 13.5 ఓవర్లలోనే 192 పరుగుల భారీ స్కోరుకు చేరుకుంది. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి అస్సలు లేకుండా హైదరాబాద్ బౌలింగ్ లైనప్‌ను క్లూలెస్‌గా మార్చేస్తూ రాజస్థాన్ క్రియేట్ చేసిన ఈ రికార్డు, ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోతుంది.

అంతేకాకుండా, రాజస్థాన్ రాయల్స్ కేవలం 14.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్/నాకౌట్ చరిత్రలోనే అత్యంత వేగంగా నమోదైన టీమ్ 200 పరుగుల రికార్డు ఇదే. గత మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 16.4 ఓవర్లలో సాధించిన రికార్డును రాజస్థాన్ రాయల్స్ రెండు రోజుల వ్యవధిలోనే బద్దలు కొట్టడం విశేషం.