Mumbai Indians: ఐపీఎల్‌లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…

Mumbai Indians

Mumbai Indians

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. టీ20 ఫార్మాట్‌లో 50,000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి జట్టుగా రికార్డు సృష్టించింది. 2008లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ముంబై, ఇప్పటివరకు 308 మ్యాచ్‌ల్లో 50,003 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో ఇతర జట్ల వివరాల్లోకి వెళ్తే.. సోమర్‌సెట్ (ఇంగ్లాండ్): 48,244 పరుగులతో రెండో స్థానం, ఆర్సీబీ (RCB) 47,304 పరుగులతో మూడో స్థానం, సీఎస్కే (CSK) 46,438 పరుగులతో నాలుగో స్థానం, టీమ్ ఇండియా 45,241 పరుగులతో ఐదో స్థానంలో నిలిచింది (టాప్-5లో ఉన్న ఏకైక అంతర్జాతీయ జట్టు).

ఐపీఎల్ ప్రయాణం..
ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిళ్లను, రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలను గెలుచుకుంది. 2008లో సచిన్ టెండూల్కర్‌ను ఐకాన్ ప్లేయర్‌గా ఎంపిక చేయడంతో వీరి ప్రయాణం మొదలైంది. హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు జట్టును నడిపించినా.. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై స్వర్ణయుగాన్ని చూసింది. రోహిత్ నాయకత్వంలో 2013, 2015, 2017, 2019 మరియు 2020లో ముంబై విజేతగా నిలిచింది.

2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఆ సీజన్‌లో జట్టు చివరి స్థానంలో నిలిచింది. 2025లో రెండో క్వాలిఫైయర్ వరకు వెళ్లినా పంజాబ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ప్రస్తుత 2026 సీజన్ ముంబైకి కలిసిరావడం లేదు. రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో, కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. విజయాలు లేకపోయినా, పరుగులు సాధించడంలో మాత్రం ముంబై తన ఆధిపత్యాన్ని చాటుకుంది.