ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఒక హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా హోం గ్రౌండ్‌లో ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై భారీ విజయాన్ని నమోదు చేయడం ద్వారా పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. టాప్-2లో నిలిస్తే ప్లేఆఫ్స్‌లో క్వాలిఫయర్-1 ఆడే అవకాశం దక్కుతుంది కాబట్టి.. సన్‌రైజర్స్ ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఉప్పల్ మైదానంలో ఆరెంజ్ ఆర్మీకి ఇదే చివరి హోమ్ మ్యాచ్ కావడంతో, ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాలని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యం తమ అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రత్యేకమైన అభ్యర్థన చేసింది. సీజన్ పొడవునా తమకు ఎంతో అండగా నిలిచి, ప్రతి మ్యాచ్‌లోనూ స్టేడియంకు వచ్చి భారీగా మద్దతు ప్రకటించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలపాలని జట్టు నిర్ణయించింది.
మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియం వదిలి వెళ్లకుండా అభిమానులందరూ తమ స్టాండ్స్‌లోనే వేచి ఉండాలని యాజమాన్యం కోరింది. మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ అంతా కలిసి మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు చేతులెత్తి మొక్కుతూ ధన్యవాదాలు తెలియజేసే “వన్ లాస్ట్ ల్యాప్ సెరమనీ” నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక వేడుక ద్వారా ఈ సీజన్ అంతా లభించిన అపారమైన ప్రేమాభిమానాలకు ఆటగాళ్లు నేరుగా స్పందించనున్నారు. కాబట్టి మైదానానికి వచ్చే ప్రతి ఒక్కరు ఈ అద్భుతమైన క్షణాలను వీక్షించాలని, అలాగే ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ స్టాండ్స్‌లోనే ఉండి జట్టుకు వీడ్కోలు పలకాలని ఎస్‌ఆర్‌హెచ్ కోరింది. ఉప్పల్ స్టేడియం ఆరెంజ్ మయంగా మారనున్న ఈ మ్యాచ్ అటు ఆటపరంగా, ఇటు అభిమానుల సెంటిమెంట్ పరంగా ఎంతో ఆసక్తికరంగా మారనుంది.
