KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..

Kkr

Kkr

రేపు (మే3,2026) ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ వరుసగా ఐదు విజయాలతో ఊపుమీదుంటే, కోల్‌కతా తన ఓపెనింగ్ సమస్యలతో సతమతమవుతోంది. ఎలాగైనా హైదరాబాద్ మీద గెలవాలన్న కసితో కేకేఆర్ ప్రణాళికలు రచిస్తోంది.

హైదరాబాద్ దూకుడు.. కోల్‌కతా కష్టాలు..
SRH బలం: హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింగే నెట్స్‌లో కొత్త బంతితో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కోల్‌కతా టాప్ ఆర్డర్ బ్యాటర్లను ఆరంభంలోనే దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఫామ్ హైదరాబాద్‌కు పెద్ద ప్లస్ పాయింట్.

KKR బలహీనత: ఈ సీజన్‌లో కోల్‌కతా ఓపెనర్లు అస్సలు రాణించడం లేదు. రహానే ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సునీల్ నరైన్ మళ్ళీ ఓపెనర్‌గా వస్తాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. టిమ్ సీఫెర్ట్ కూడా గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు.

హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి, రేపు సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చు. ఈ మ్యాచ్ మూడో నంబర్ పిచ్‌పై జరుగుతుంది. సాధారణంగా ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిచ్ కొంచెం నెమ్మదించే అవకాశం ఉన్నా, పరుగులకైతే లోటుండదు.

స్పిన్నర్లను ఎదుర్కోవడంలో క్లాసెన్ దిట్ట. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అతను 200 పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తాడు. ట్రావిస్ హెడ్ పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో నరైన్ రికార్డ్ బాగుంది. ఈ సారి పకడ్బందీ ప్రణాళికతో కేకేఆర్ బరిలోకి దిగి సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఆత్రుతతో ఉంది.

జట్ల అంచనా .. 
SRH: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), ప్రఫుల్ హింగే తదితరులు.

KKR: అజింక్య రహానే (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్, కెమెరూన్ గ్రీన్, రింకూ సింగ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా తదితరులు. ఒకవేళ మతీష పతిరాణ ఫిట్‌గా ఉంటే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

రికార్డుల పరంగా కోల్‌కతాకు హైదరాబాద్‌పై మంచి ఆధిపత్యం (20-11) ఉన్నా.. ప్రస్తుత ఫామ్ చూస్తే మాత్రం సన్‌రైజర్స్‌దే పైచేయిలా కనిపిస్తోంది. మరి ఉప్పల్ గడ్డపై ‘ఆరెంజ్ ఆర్మీ’ ఆరో విజయం సాధిస్తుందో లేదో చూడాలి.