రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ (IPL 2026) ట్రోఫీని గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టును ఆర్‌సీబీ బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు కేవలం 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం 42 బంతుల్లోనే 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. రజత్ పటీదార్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ ఈ ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది.
అయితే.. ఈ గొప్ప విజయం సాధించినప్పటికీ బెంగళూరు నగరంలో ఎలాంటి ‘విజయ యాత్ర’ (విక్టరీ పరేడ్) నిర్వహించట్లేదని ఆర్‌సీబీ యాజమాన్యం స్పష్టం చేసింది. అభిమానులంతా తమ ఇళ్లలోనే ఉండి, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంతోషాన్ని జరుపుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరింది.
What a night. What a feeling. 🥹
To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️
As the celebrations begin, let’s be responsible. 🙌
Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026
ఈ నిర్ణయం వెనుక ఒక బాధాకరమైన కారణం ఉంది. జూన్ 2025లో ఆర్‌సీబీ మొదటిసారి ఐపీఎల్ కప్పు గెలిచినప్పుడు, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు జ్ఞాపకాలు, భద్రతా కారణాలను మనసులో ఉంచుకుని, ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో యాజమాన్యం రోడ్లపై వేడుకలను రద్దు చేసింది. అభిమానుల ప్రాణాల రక్షణే తమకు ముఖ్యమని చెప్తూ, అందరూ బాధ్యతాయుతంగా ఇళ్లలోనే పండగ చేసుకోవాలని ఆర్‌సీబీ కోరింది.
