ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ రోజు జరిగే క్వాలిఫయర్-2 పోరు అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది. ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ (RR), మరోవైపు గుజరాత్ టైటాన్స్ (GT) ఫైనల్ బెర్తు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ కీలకమైన మ్యాచ్ మే 29, 2026 (ఈరోజు) రాత్రి 7:30 గంటలకు మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్ (మొహాలీ) వేదికగా జరగనుంది. దీనికి సంబంధించిన టాస్ రాత్రి 7:00 గంటలకు పడుతుంది.
ఈ సీజన్ ప్లేఆఫ్స్‌లో ఒక విచిత్రమైన సెంటిమెంట్ నడుస్తోంది. గత రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లోనూ (క్వాలిఫయర్-1, ఎలిమినేటర్) టాస్ గెలిచి, మొదట బౌలింగ్ ఎంచుకున్న జట్లే ఘోరంగా ఓడిపోయాయి. సాధారణంగా టీ20ల్లో టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ చేసి, ఆ తర్వాత ఈజీగా ఛేజ్ చేయవచ్చని కెప్టెన్లు భావిస్తారు. కానీ ఈ ప్లేఆఫ్స్ మ్యాచుల్లో మొదట బౌలింగ్ చేసిన జట్లు భారీగా పరుగులు సమర్పించుకుని తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళిపోయాయి. పిచ్ ద్వితీయార్థంలో నెమ్మదించడం వల్ల ఛేజింగ్ చేసే జట్లు కుప్పకూలుతున్నాయి. అందుకే ఆర్ఆర్, జీటీ కెప్టెన్లు ఇద్దరూ ఒకవేళ టాస్ గెలిస్తే ఏం నిర్ణయం తీసుకోవాలా అని సందిగ్ధంలో పడ్డారు. టాస్ గెలిచి తప్పుడు నిర్ణయం తీసుకునే కంటే, టాస్ ఓడిపోవడమే బెటర్ అనే భావనలో ఫ్యాన్స్ ఉన్నారు.
గణాంకాల ప్రకారం ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలుపు అవకాశాలు 55.1 శాతం కాగా, గుజరాత్ టైటాన్స్ అవకాశాలు 44.9 శాతంగా కనిపిస్తున్నాయి. అయితే నాకౌట్ మ్యాచ్ కావడంతో ఒత్తిడిని ఎవరు సమర్థవంతంగా ఎదుర్కొంటారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఒక మ్యాచ్‌లో ఆర్‌ఆర్, మరో మ్యాచ్‌లో జీటీ విజయం సాధించి సమవుజ్జీలుగా నిలిచాయి. డూ ఆర్ డై లాంటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ పాత తప్పులను రిపీట్ చేస్తాడా లేక ట్రెండ్‌ను బ్రేక్ చేసి మొదట బ్యాటింగ్ ఎంచుకుంటాడా అనేది చూడాలి. ఆ తలకాయ నొప్పి మనకెందుకు ఆ ఆప్షన్ ఎదుటి కెప్టెన్ కే ఇస్తే బాగుంటుంది.. టాస్ ఓడిపోవడమే బెటర్ అనే కోణంలో కెప్టెన్స్ ఉన్నట్లు క్రీడా వర్గాల్లో వినిపిస్తోంది.
