Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..

Pbks

Pbks

ఐపీఎల్ 2026 సీజన్ సగం ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు సమన్వయంతో ఆడుతూ పటిష్టమైన స్థితికి చేరుకుంది. వరుస విజయాలతో ప్లే-ఆఫ్స్‌కు చేరువైన పంజాబ్, అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

ప్రీతి జింటా స్పందన…
సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసిన రెండు రోజుల తర్వాత.. ప్రీతి జింటా ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. పంజాబ్ చివరి హోమ్ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోవడం పట్ల ఆమె కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా, జట్టు ఓవరాల్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. “మా షేర్ స్క్వాడ్ అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం గర్వంగా ఉంది. పంజాబ్ గ్రౌండ్‌లో చివరి మ్యాచ్ ఆశించినట్లు జరగలేదు.. కానీ ఇంకా ముందు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి” అని ఆమె పేర్కొన్నారు.

8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో, 1.043 నెట్ రన్ రేట్‌తో పంజాబ్ 13 పాయింట్లు సాధించింది. ప్లే-ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి జట్టుకు మరో 3 పాయింట్లు మాత్రమే అవసరం. టాప్-2లో నిలిచి ఫైనల్‌కు వెళ్లడానికి రెండు అవకాశాలు (క్వాలిఫైయర్స్) పొందడమే లక్ష్యంగా జట్టు ఆడుతోంది.

గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో మొదలైన వీరి ప్రయాణం.. చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి బలమైన జట్లను ఓడించే వరకు సాగింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో తొలి ఓటమి ఎదురైనప్పటికీ, పంజాబ్ పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (346 పరుగులు) జట్టును ముందుండి నడిపిస్తుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (309 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య 250.44 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసురుతున్నారు. తదుపరి మ్యాచ్‌లు ధర్మశాల వేదికగా జరగనున్నాయి.