MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్ పాండ్యా..

Hardik Pandya

Hardik Pandya

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు ప్రదర్శన ఆందోళనకరంగా మారింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఈ సీజన్ ముంబైకి ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏకంగా ఆరు ఓటములతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో వెనుకబడింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన పాండ్యా, ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాక ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అభిమానుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్, ఇప్పుడు జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు.

మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ముంబై జట్టులో మార్పులు చేయాలనుకుంటే ముందుగా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఒకవేళ హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటే.. అతన్ని జట్టు నుంచి పూర్తిగా రిలీజ్ చేయడం మంచిదని సలహా ఇచ్చారు. కెప్టెన్సీ పోయాక అతను అదే జట్టులో సాధారణ ఆటగాడిగా ఎంతవరకు రాణించగలడో చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తడబడుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఒత్తిడిలో తన సహజ సిద్ధమైన ఆటను ఆడలేకపోతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 243 పరుగులు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయింది. బుమ్రా వంటి స్టార్ బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడంతో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు ప్రదర్శనపై హార్దిక్ అసహనం వ్యక్తం చేశాడు. తాము నిర్దేశించుకున్న ప్రమాణాలకు తగ్గట్లుగా ఆడటం లేదని ఒప్పుకున్నాడు. బౌలింగ్ విభాగంలో వనరులు తక్కువగా ఉన్నాయని, ఒత్తిడిలో తప్పులు చేస్తున్నామని అతను తెలిపాడు.

ముంబై భవిష్యత్తు ఏమిటి..?

ముంబై ఇండియన్స్ చరిత్రలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటోంది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా జట్టును ఏకం చేయడంలో విఫలమవుతున్నాడని మాజీలు అంటున్నారు. వచ్చే సీజన్‌లో మెగా వేలం ఉండటంతో.. ముంబై యాజమాన్యం హార్దిక్‌ను అట్టిపెట్టుకుంటుందా లేక కొత్త కెప్టెన్ కోసం వెతుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న స్థితిలో ప్లే ఆఫ్స్ చేరడం ముంబైకి అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ అద్భుతం జరిగి మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. తన ఆటను, కెప్టెన్సీని హార్దిక్ మళ్ళీ గాడిలో పెట్టుకుంటాడో లేదో వేచి చూడాలి.