Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..

Rohit Sharma

Rohit Sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుతిరిగాడు. ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే అవుట్ కావడంతో రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ డకౌట్‌తో ఐపీఎల్ టోర్నీ హిస్టరీలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన ఆటగాడిగా గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి రోహిత్ శర్మ సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు డకౌట్ కావడం గమనార్హం.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్ కూడా 19 డకౌట్లతో రోహిత్ శర్మతో పాటే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లు దినేష్ కార్తీక్ మరియు సునీల్ నరైన్ చెరో 18 డకౌట్లతో రెండో స్థానంలో నిలిచారు. అలాగే స్పిన్ బౌలర్లు పియూష్ చావ్లా, రషీద్ ఖాన్‌లు కూడా బ్యాటింగ్‌లో చేతులెత్తేస్తూ చెరో 16 సార్లు సున్నా పరుగులకే అవుట్ అయి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (0), ర్యాన్ రికెల్టన్ (12), నమన్ ధీర్ (6), తిలక్ వర్మ (3) తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో ముంబయి ఇండియన్స్ కష్టాల్లో పడింది. అయితే క్రీజులో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 45 పరుగులు, విల్ జాక్స్ 16 బంతుల్లో 27 పరుగులతో వేగంగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చేందుకు పోరాడుతున్నారు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ గెలవాలంటే ఇంకా 54 బంతుల్లో 112 పరుగులు చేయాల్సి ఉంది.