IPL 2026 సీజన్‌లో 41 మ్యాచ్‌ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..

Ipl 2026 Impact Player

Ipl 2026 Impact Player

IPL 2026 Run Fest Explained: టీ20 క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) అంటేనే ఒక సరికొత్త ప్రయోగశాలకు నాంది. సరికొత్త రికార్డులు, నరాలు తెగే ఉత్కంఠకు ఐపీఎల్ పెట్టింది పేరు. సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల ఆధిపత్యం, సిక్సర్లు, ఫోర్ల వర్షం అని మనందరికీ తెలిసిందే. మైదానంలో బ్యాటర్లు తమ పవర్-హిట్టింగ్‌తో విరుచుకుపడుతుంటే.. ప్రేక్షకులు ఆ వినోదాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. అయితే.. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ పరుగుల వరద మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుంది. గతంలో అరుదుగా కనిపించే 200 ప్లస్ స్కోర్లు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఈ సీజన్‌లో కేవలం 41 మ్యాచ్‌లు ముగిసే సమయానికే 10 సార్లు 200కు పైగా టార్గెట్లు ఛేజ్ అయ్యాయి. ఇది ఒక సరికొత్త ఐపీఎల్ రికార్డ్. ఇంకా ఈ సీజన్‌లో 33 మ్యాచ్‌లు మిగిలే ఉండటం విశేషం. గత ఏడాది అంటే 2025లో మొత్తం 74 మ్యాచ్‌ల్లో 9 సార్లు మాత్రమే ఈ ఘనత నమోదైతే, ఈసారి సగం సీజన్‌కే ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గత రెండు సీజన్లలో కలిపి జరిగిన 19 భారీ రన్ ఛేజ్‌లలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే చివరి ఓవర్ వరకు వెళ్లాయంటే, బ్యాటర్లు ఎంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇక.. ఈ భారీ స్కోర్ల వెనుక ఉన్న అసలు రహస్యం కేవలం బ్యాటర్ల ఫామ్ మాత్రమే కాదు, నిబంధనల్లో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇలా పరుగుల సునామీ రావడానికి ప్రధాన కారణం 2023లో ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిబంధన వల్ల జట్ల బ్యాటింగ్ డెప్త్ పెరిగింది. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ వంటి వెసులుబాటు వల్ల జట్లు ఎనిమిదో స్థానంలోనూ అద్భుతమైన బ్యాటర్‌ను పంపగలుగుతున్నాయి. దీనివల్ల బ్యాటర్లకు అదనపు ధైర్యం లభించి, తొలి బంతి నుంచే విరుచుకుపడుతున్నారు. ఫలితంగా బంతికి, బ్యాట్‌కు మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతిని, బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక 2008 నుంచి 2022 వరకు అంటే దాదాపు 15 ఏళ్ల కాలంలో కేవలం 15 సార్లు మాత్రమే 200 పైచిలుకు స్కోర్లు ఛేజ్ అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన ఈ మూడు నాలుగేళ్లలోనే 33 సార్లు భారీ లక్ష్యాలు కరిగిపోయాయి. దీనికి తోడు ఫ్లాట్ పిచ్‌లు సైతం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.

అసలు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వివరాలు..
ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు 11 మంది ఆటగాళ్లతోపాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌లను ప్రకటించాలి. ఆ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్‌ ఆటగాడిగా ఆడించేందుకు అవకాశం ఉంటుంది. తుది జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉంటే మాత్రం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా భారత క్రికెటర్‌నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఆడించుకోవచ్చు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్‌ స్థానంలో స్పిన్నర్‌ను ఇంపాక్ట్‌ ఆటగాడిగా ఆడించొచ్చు. ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్‌ అవసరం ఉంది అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్‌ స్థానంలో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇంపాక్ట్‌ ఆటగాడి కోసం మైదానం వీడిన క్రికెటర్‌ మళ్లీ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందు లేదా ఓవర్‌ ముగిశాక లేదా వికెట్‌ పడ్డాక లేదా ఓ బ్యాటర్‌ రిటైరయ్యాకే ఇంపాక్ట్‌ ఆటగాడు మైదానంలోకి రావాల్సి ఉంటుంది. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన బౌలర్‌ స్థానంలో వచ్చే ఇంపాక్ట్‌ ఆటగాడు తన పూర్తి కోటా నాలుగు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు కెప్టెన్‌గా మాత్రం బాధ్యతలు నిర్వర్తించకూడదు. 11 మంది మాత్రమే బ్యాటింగ్‌ చేయాలి.