ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తడబడిన పంజాబ్ బ్యాటర్లు..
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (2), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (15) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. వన్ డౌన్‌లో వచ్చిన కూపర్ కానోలీ డకౌట్ కాగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 19 పరుగులకే వెనుదిరిగాడు. ఒక దశలో పంజాబ్ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు.
సూర్యాన్ష్, స్టోయినిస్ పోరాటం..
మధ్యలో సూర్యాన్ష్ షెడ్జ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. కేవలం 29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 57 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అతనికి తోడుగా మార్కస్ స్టోయినిస్ (40 పరుగులు; 31 బంతుల్లో) బాధ్యతాయుతంగా ఆడాడు. చివర్లో మార్కో జాన్సెన్ 11 బంతుల్లో 20 పరుగులు చేయడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
గుజరాత్ బౌలింగ్ అద్భుతం..
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ అత్యద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ చెరో రెండు వికెట్లతో పంజాబ్ వెన్ను విరిచారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాలంటే 164 పరుగులు చేయాల్సి ఉంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నందున, గుజరాత్ ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.
