Site icon NTV Telugu

IPL: నేటి నుంచి ఐపీఎల్‌ షురూ… ఇక రచ్చ రచ్చే..

క్రికెట్‌ ప్రేమికులకు అసలైన మజా ప్రారంభం కాబోతోంది.. క్రికెట్‌లో పొట్టి పార్మాట్‌ అయిన టీ-20 మ్యాచ్‌లకు మంచి క్రేజ్‌ ఉంది.. ఇక, ఐపీఎల్‌లో అది మరింత పీక్‌కు వెళ్లింది.. కరోనా కంటే ముందు స్టేడియానికి వెళ్లే సందడి చేస్తే.. కోవిడ్‌ కారణంగా టీవీల ముందు ఎంజాయ్‌ చేశారు.. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ కొంత మారడంతో.. స్టేడియానికి వెళ్లే అవకాశం మళ్లీ వచ్చేసింది.. ఇక, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ 15వ సీజన్‌ ఇవాళే షురూకానుంది.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆరంభ వేడుకలు అదిరిపోనున్నాయి. రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ తలపడనుంది. ఇక, ఈ రెండు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. సీఎస్కేకు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, కేకేఆర్‌కు శ్రేయస్ అయ్యర్‌… నాయకత్వం వహించనున్నారు. కోల్‌కతాపై చెన్నైకి మంచి రికార్డు ఉంది. ఈ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా…17 మ్యాచుల్లో చెన్నై, 8 మ్యాచుల్లో కోల్‌కతా గెలుపొందాయి. మరో మ్యాచులో ఫలితం తేలలేదు.

Read Also: Astrology: మార్చి 26, శనివారం దినఫలాలు

గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిన చెన్నై.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో మరో టైటిల్‌పై కన్నేసింది. ఈ జట్టులో దాదాపు అందరూ పాత ఆటగాళ్లే ఉండటం కలిసొచ్చే అంశం. రుతురాజ్ గైక్వాడ్, ధోని, అంబటి రాయుడు, మొయిన్ అలీ, డ్వేన్‌ బ్రావోలతో జట్టు బలంగా ఉంది. శ్రేయస్ అయ్యర్‌ సారథ్యంలో ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. వెంకటేశ్ అయ్యర్‌, నితీశ్‌ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ వంటి ఆల్‌ రౌండర్లతో పాటు బౌలింగ్‌లోనూ ఆ జట్టు సమతూకంగా ఉంది.

మరోవైపు, మెగా టోర్నీలో భారీ మార్పులు వచ్చాయి. కొత్తగా రెండు జట్లు ఈ టోర్నీలోకి అడుగుపెట్టాయి. మహారాష్ట్రలోని నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో మూడు ముంబైలో ఉండగా… ఒకటి పూణెలో ఉంది. చాలా రోజుల తర్వాత మైదానాల్లో అసలు సిసలైన క్రికెట్ మజా కనిపించనుంది. కరోనా కారణంగా గత సీజన్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లోనే నిర్వహించారు. ఈ సారి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో… 25 శాతం మందికి అనుమతించేందుకు బీసీసీఐ అంగీకరించింది. దీంతో ప్రేక్షకుల ఈలలు, కేరింతలతో మైదానాలకు కళ రానుంది. ఛీర్‌ గర్ల్స్‌ సందడి చేయనున్నారు.

Exit mobile version