NTV Telugu Site icon

IPL 2022 : RCB పై సూపర్ విక్టరీ..పంజాబ్ ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం

Rcb Vs Pk

Rcb Vs Pk

ఆర్సీపీపై పంజాబ్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది ఆర్సీబీ. ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేక చతికిలపడింది. శుక్రవారం ముంబై బ్రెబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ముందు ఉంచింది. కాగా భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన ఆర్సీబీ ఎక్కడా పోటీ ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్క ప్లేయర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. 20 ఓవర్లలో 9 వికేట్ల నష్టానికి 155 పరుగులు చేసి 54 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓడిపోయింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీకి నిర్థేశించింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్ స్టో, లివింగ్ స్టన్ ఇద్దరూ ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడారు. బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్ల, 7 సిక్సులతో 66 పరుగులు చేశాడు. లివింగ్ స్టన్ 42 బాల్స్ లో 70 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా.. హసరంగ 2 వికెట్లు తీశాడు.

భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన ఆర్సీబీలో ఒక్కరు కూడా విజయం కోసం ఆడినట్లు కనిపించలేదు. కోహ్లీ యథావిధిగానే తన ఫెయిల్యూర్ ను కొనసాగించాడు. కోహ్లీ కేవలం 20 పరుగులు చేసి వెనుతిరిగాడు. గ్లెన్ మాక్స్ వెల్ 35, రజత్ పాటిదార్ 26 పరుగులు చేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న దినేష్ కార్తిక్ కూడా 11 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 3, రాహుల్ చాహర్ 2, రిషీ ధావన్ 2 వికెట్లను పడగొట్టారు. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. ప్రస్తుతం పాయింట్ టేబుల్ లో ఆర్సీబీ 13 మ్యాచుల్లో 7 విజయాలతో నాలుగో స్థానంలో ఉండగా… పంజాబ్ 12 మ్యాచుల్లో 6 విజయాలతో ఆరోస్థానంలో ఉంది.